Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి. మేము ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తాం. అయినప్పటికీ విమానాలు సమయానికి చేరుకోవు. దీని కారణంగా పిల్లలు, వృద్ధులతో సహా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు
నేను ఎయిర్ఇండియా సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించా. దీనికోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు. విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ని ఈసందర్భంగా కోరుతున్నా. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి అని ఆమె రాసుకొచ్చారు.
తగు జాగ్రత్తలు తీసుకుంటామని
మరోవైపు ఈ పోస్టు పై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. తమ చేతుల్లో లేని పలు సమస్యల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపింది. మీరు ప్రయాణించే విమానానికి అలాంటి సమస్యే ఎదురైనట్లు వెల్లడించింది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా పేర్కొంది.