Sunita Williams : దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్‌కమ్ చెప్పింది.

స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్ రాష్ట్రంలోని ఝూలాసన్‌లో ఆమె బంధువులు, స్థానికులు బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 286 రోజుల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి రావడంపై ఆమె సోదరి ఫాల్గుణి పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు. సునీత కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
సునీత త్వరలోనే భారత్‌కు
ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి, నాసాకు కృతజ్ఞతలు తెలిపారు. సునీత త్వరలోనే భారత్ కు రానున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.ఓ జాతీయ మీడియాతో ఫాల్గుణి మాట్లాడుతూ.. తొమ్మిది నెలల విరామం తర్వాత సునీత సురక్షితంగా భూమిపైకి రావడం సంతోషంగా ఉంది. ఆమె పుడమిపైకి దిగిన క్షణాలు అపురూపం. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదు. సునీత త్వరలోనే భారత్‌కు రానున్నారు. మేమంతా వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపబోతున్నాం అని తెలిపారు.