Venkateswara Swamy Temple : శ్రీనివాసుని మామగారు ఆకాశరాజు సొంత సోదరుడు తొండమాన్ చక్రవర్తి. విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాడు. ప్రతిరోజూ తన గ్రామం నుంచి తిరుమల వచ్చి ఆ శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటాడు. అలా చాలా కొన్ని రోజులు సేవించిన సంవత్సరాల అనంతరం తొండమాన్ చక్రవర్తికి వార్థక్యం వచ్చింది. ఇక, తనకు ఓపిక క్షీణించిందని, తాను ఇక తిరుమలకు వచ్చి ఆ శ్రీనివాసుడిని కొలవలేనని ఎంతో బాధపడ్డాడు.

తన ప్రియభక్తుని బాధకు పరిహారంగా ఆయన ఇంటనే స్వయంభువుగా శ్రీనివాసుడు వెలిసిన క్షేత్రమే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని “తొండమనాడు”(thondamanadu). ఈ గ్రామం అసలు పేరు తొండమాన్పురం. ఒక చేతితో యోగముద్ర, మరో చేత అభయ హస్తం కలిగి శ్రీదేవి, భూదేవి సమేతుడుగా కూర్చున్న భంగిమలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే ఆలయం “శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం”. అయితే, ఈ దేవాలయం గురించి భక్తులకు అంతగా తెలియదు.
కూర్చున్న భంగిమలో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చే దేవాలయం ప్రపంచంలో ఇది ఒక్కటేనేమో! చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని 2008వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకుంది.

ప్రధాన ప్రవేశ ద్వారానికి రాజగోపురం ఉంటుంది. రాజగోపురం ఎగువన మూడు అంచెలను కలిగి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం ముందు బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడాళ్వార్ మండపాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి? తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలో తిరుపతికి 33 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ గ్రామం. శ్రీ కాళహస్తి నుంచి 8 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రతి బస్సు ఈ స్టేజ్లో ఆగుతుంది. రోడ్డు మీద నుంచి కనిపించే పక్కదారి నుంచి అయిదు కి.మీ. దూరం ప్రయాణించాలి. ఈ అయిదు కి.మీ. స్వంత వాహనం లేనివారు ఆటోలను ఆశ్రయించాలి.(Venkateswara Swamy Temple)