ఓ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న తోటలో కొన్ని అందమైన పిల్ల సీతాకోక చిలుకలు ఉండేవి. వాటిలో ఓ చురుకైనది అపార్ట్మెంట్లో కొత్తగా ప్రారంభించిన బ్యూటీపార్లర్లోకి తొంగి చూసింది. అక్కడికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి అందంగా తయారై వెళ్లడం గమనించింది. ఆ విషయాన్ని తన తోటి స్నేహితు రాళ్లకు చెప్పింది. అన్నీ గుంపుగా వెళ్లి, అమ్మాయిలు రంగులేసు కోవడం చూసి ‘భలేభలే’ అనుకు న్నాయి. మనం కూడా రంగులేసు కుంటే ఎలా ఉంటుందని ఊహించాయి. ‘మధ్యాహన్నం పార్లర్ మూసేశాక ఎవ్వరూ ఉండరు, మనం వెళ్లి, నచ్చిన రంగు పూసుకోవచ్చు’ అని ఆలోచించాయి. అనుకున్నదే తడవు, వెంటనే అమలు చేశాయి. పిల్ల సీతాకోక చిలుకల్లో ఏదో తేడా కనబడుతోందని వాటి పెద్దలు గుర్తించి ఓ రోజు వాటిని నిలదీశాయి. ‘మీది పాతతరం. మీలాగే ఉంటే మేం ఎగబడలేం.

ఆధునిక పద్ధతుల్ని మేం అనుసరిస్తేనే మాకు మనుగడ’ అని పిల్ల సీతాకోకచిలుకలు ఎదురుతిరిగాయి. అయినా పెద్దతరం సీతాకోక చిలుకలు అన్నిటినీ కూర్చోబెట్టి ఇలా హితబోధ చేశాయి. ‘అందరూ – అసహించ్యుకునే గొంగళి పురుగుల నుంచి మనం అందమైన జీవాలుగా మారాము. ప్రకృతి మనకు ఇచ్చినన్ని అందాలు వేరే కీటకాలకు ఇవ్వలేదు. సహజంగా ఉండక కృత్రిమ రంగులను ఎందుకు ఆశ్రయిస్తారు? మనం మనంగా ఉందాం. మనుషు లను అనుకరించాల్సిన అవసరం లేదు. వారి జీవన విధానం మనది వేరువేరే’ అని. ఆ మాటలను పిల్ల సీతాకోక చిలుకలు చెవిన వేసుకోలేదు. ‘మనం అందంగా తయారవుతున్నామని వాళ్లకు కుళ్లు. అందుకే అడుగడుగునా అడ్డు పడుతున్నారు’ అని తిట్టుకున్నాయి. ‘ఎలాగూ పెద్దలకు తెలిసిపోయింది కదా’ అని రోజుకో కొత్తరకం రంగులేసుకుని ఊరేగేవి.

దూరంగా ఉన్న మామిడి తోటకి వెళ్లి అక్కడి సీతాకోక చిలుకల ముందు ‘బడాయి’ పోడేసి. మా అందం ముందు ఎవ్వరూ సరితూగలేరసి వాటిని రెచ్చగొట్టేవి. మీకు కూడా రంగుల రహస్యం చెబుతామని వాటి వద్ద ఉన్న తేనెను తాగేసేవి. మామిడితోట సీతాకోక చిలుకలు వీటి వేషధారణ చూసి ఆశ్చర్యపోయేవి. తమకన్నా గొప్పవని, అందుకే కొత్తకొత్త రంగులతో ఆకర్షణీయంగా ఉన్నాయని భావించేవి. అలా ఓ రోజు గొప్పలు పోతుండగా జోరున వర్షం కురిసింది. చెట్ల చాటున దాక్కొన్నా, వర్షం ధాటికి అవి బాగా తడిసిపోయాయి. వేసుకున్న రంగులన్నీ తుడుచుకుపోయాయి. అసలు స్వరూపం బయటపడింది. దాంతోపాటు కృత్రిమ రంగులు వాడి ఉండటం వల్ల సహజమైన కాంతి, మెరుపు, అందం కోల్పోయి అసహ్యంగా కనిపించ సాగాయి. రసాయనాల ప్రభావం వల్ల కొన్నిటి రెక్కలు మడతపడటం కూడా జరిగింది.

వర్షం నిలిచిన తర్వాత మామిడితోట సీతాకోక చిలుకలన్నీ చాటు నుంచి బయటికి వచ్చాయి. మిత్రులుగా వచ్చిన వాటి రంగుల మోసం కనిపెట్టే శాయి. వాటికి బుద్ధి చెప్పాలని పక్కనే తాటితోపులో ఉన్న తేనెటీగలకు విషయం చెప్పాయి. తేనెటీగలన్నీ మూకుమ్మడిగా వాటిపై దాడి చేసి ఒకటికి రెండుసార్లు కుట్టాయి. అన్ని పిల్ల సీతాకోక చిలుకలూ ఏడ్చుకుంటూ తమ సొంత అపార్ట్మెంట్కు వచ్చి చేరాయి. ‘తప్పు తెలుసుకున్నామని, ఇంకెప్పుడూ పైపై మెరుగుల కోసం ప్రాకులాడమని’ పెద్దలకు చెప్పాయి. సంతోషించిన పెద్దతరం, పిల్ల సీతాకోకచిలు కలన్నిటినీ, పక్కనే ఉన్న గులాబీ తోటలోకి తీసుకెళ్లి మధురాతిమధురమైన మకరందాన్ని తాగించాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: