Neelakurinji Flowers : పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో షోలా అడవుల్లో నీల కురింజి పుష్పాలు వికసించాయి. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూచే ఈ పువ్వుల శోభతో ఈ ప్రాంతంలోని పచ్చని కొండలు నీలిరంగు తివాచీ పరిచినట్టుగా ప్రకృతి ప్రేమికుల్ని పరవశింపజేస్తున్నాయి. నీల కురింజి అంటే మళయాళ భాషలో నీలి పుష్పం అని అర్థం.

నీలకురింజి శాస్త్రీయ నామం స్ట్రోబిలంతెస్ కుంతియానా(Strobilanthes kuntiana). ఉదా, నీలి రంగులో ఈ పుష్పాలు ప్రకాశవంతమైన రంగులో గంట ఆకారంలో గుబురుగా ఉండే పొదలుగా పెరుగుతాయి. దట్టమైన చెట్ల అడవులు లేని, లోయ దిగువన విస్తీర్ణంలో కురింజి పువ్వులు పెరుగుతాయి. సుదీర్ఘ విరామంతో అసాధారణంగా వికసించే మొక్కలను ప్లీటీసియల్స్ అంటారు. జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పూసి చనిపోయే ఈ పుష్పాల విత్తనాలు తిరిగి మొలకెత్తడానికి సంవత్సర కాలం పడుతుంది. వృక్ష శాస్త్రంలో దీనిని సర్వైకల్లో మెకనిజం (మనుగడ విధానం)గా సూచిస్తారు.
ప్రపంచంలో దాదాపు 250 రకాల కురింజి జాతులు ఉన్నాయి. భారతదేశంలో 46 విభిన్న కురింజి జాతులు పుష్పిస్తాయి. ఎక్కువగా పశ్చిమ కనుమల్లో వీటిని మనం చూడవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యకాలంలో నీల కురింజి పుష్పాలు వికసిస్తాయి. కనుక పర్యాటకులు, వృక్ష శాస్త్రజ్ఞు లు, ప్రకృతి ప్రేమికులు, ట్రావెల్ బ్లాగర్లు, రచయితలు, ప్రకృతి ఫొటోగ్రాఫర్లు, ఇతర రంగాల సందర్శకులు ఈ హిల్ స్టేషన్కు తరలివస్తారు. దేశ విదేశాల నుండి ఈ అరుదైన పుష్ప శోభను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోని కారణంగా సందర్శకులు కొన్ని రకాల ఆంక్షలను పాటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పూల సందర్శనంతో మానసిక ఉల్లాసం కలుగుతోంది.

Neelakurinji Flowers : కురింజి పుష్పాలు ఎత్తయిన కొండలపై 1300 నుండి 2400 మీటర్ల ఎత్తులో పూస్తాయి. ఈ గుబురు మొక్కలు 30 నుండి 60 సెంటీ మీటర్ల ఎత్తున పెరుగుతాయి. ఈ 46 రకాల కురింజి పుష్పాల్లో ఒక్కో రకం ఒక్కో ఎత్తు ప్రాంతాల్లో పెరుగుతాయి. కొన్ని మొక్కలు ఆరేళ్లకోసారి పూలు పూస్తాయి. కొన్ని తొమ్మిదేళ్లకు, కొన్ని 11,12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తాయి.
గత ఏడాది చిక్మంగళూరు జిల్లాలోని దత్తాత్రేయ పీఠంగా పిలిచే బాబా బుదాన్ గిరి కొండలపై నీల కురింజిలోని ఓ రకం మొక్కలు పుష్పించాయి. నీలం, ఊదా రంగుల్లో ఎక్కువ పుష్పాలు ఉంటే ఎరుపు, మెరూన్ రంగు కురింజి పువ్వులు కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తాయి. స్థానిక భాషలో దీనిని కుంతియానా అని పిలుస్తారు. ఇది కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే కుంతి నదిని సూచిస్తుంది. ఎర్రటి కొమ్మలతో గుబురుగా పూచే ఈ చెట్లను 19వ శతాబ్దంలో వీటి ఉనికిని కనుగొన్నారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఇటీవల పర్యాటకుల తాకిడి చాలా తగ్గింది. అడవుల్లో కార్చిచ్చు వల్ల అడవులు తగలబడిపోవటం, కాఫీ, తేయాకు ప్లాంటేషన్లకై ప్రైవేటు సంస్థలు కురింజి పుష్పాలు పూచే ప్రదేశాలను ఆక్రమించటం, ప్రయివేటు హౌసింగులు మొదలైన కారణాల వల్ల ఈ అరుదైన పుష్పజాతులు విస్తారంగా పూచే అవకాశాలు తగ్గిపోతున్నాయి.

ఈ పుష్ప జాతులకు సరైన వాతావరణం, అనుకూలమైన భూమి చాలా అవసరం. అలాంటి సమయంలోనే ఇవి విస్తారంగా పూస్తాయి. అక్టోబర్ నెలాఖరునాటికి విరివిగా పుష్పిస్తాయి. యూకలిప్టస్, పైన్ వంటి వృక్షాలను నాటడం వల్ల ఈ పుష్ప జాతులు పెరిగే అవకాశాన్ని కోల్పోతున్నాయి. పక్షులు, క్షీరదాల వల్ల ఈ పుష్ప జాతులకు నష్టం కారణంగా అవి వికసించడానికి ఎక్కువ సమయం పడుతుంది. సీతాకోకచిలుకలు, తేనెటీగలు నీలకురింజి పుష్పాలలో ఉండే తేనెను ఇష్టపడతాయి. అందుకే ఈ సీజన్లో తేనెటీగల ద్వారా లభించే కురింజి తేనె అరుదైన ప్రశస్తమైన తేనెగా భావిస్తారు.
ఈ తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలపాటు నిలవ ఉంటుందీ తేనె.’హనీ ట్రయల్స్ ఇన్ ది బ్లూ మౌంటెన్స్’ అనే పుస్తకం కీస్టోన్ ఫౌండేషన్ ప్రచురించింది. ఈ పుస్తకంలో వివిధ తేనెటీగల జాతుల కనిపించే జీవ వ్యవస్థను వివరంగా ప్రస్తావించారు. తేనెటీగల ద్వారా శ్రీ ద్వారా పువ్వులు పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ తేనెటీగల ద్వారా సేకరించిన తేనె చాలా తియ్యగా, పోషక విలువలు కలిగి, అధిక ఔషధ గుణాలను కలిగి వుంటుంది. స్థానిక పాలియన్ తెగ ప్రజలు ఈ తేనెను సేకరిస్తారు. వీరు ఒకరికొకరు ఈ తేనెను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. అమూల్యమైన, అరుదైన ఈ తేనెను ‘లిక్విడ్ గోల్డ్’ గా పిలుస్తారు. మార్కెట్లలో లభించే ఇతర బ్రాండ్ల తేనె లాగా కాకుండా ఇది పారదర్శకంగా, కొంచెం ఆకుపచ్చ- పసుపు రంగు మిశ్రమ రంగులో ఉంటుంది. దీని రుచి ప్రత్యేకం. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పువ్వులు వికసించినపుడు మాత్రమే ఈ తేనె లభిస్తుంది. ఇది పదిహేను సంవత్సరాలకు పైగా నిలవ ఉంటుంది.

నీలి ఉదా రంగులో నీలిరంగు తివాచీ పరిచినట్టుగా మూడు వేల హెక్టార్ల కొండలు కనివిందు చేస్తాయి. వర్షాకాలం చివరి దశలో మొక్కలు పుష్పించటం ప్రారంభిస్తాయి. వర్షాలు మాయమయ్యే సమయంలో లోయలు నీల కురింజి పుష్పాలతో నిండిపోతాయి. భారతదేశంలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షా కాలం చివరి వర్షాలు కురుస్తాయి కనుక ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మున్నార్ లేదా ఏదైనా దక్షిణ హిల్ స్టేషన్ను సందర్శించవచ్చు. అస్థిరమైన వాతావరణ పరిస్థితులు, గాలులు, వర్షాల ఆధారంగా ఈ పుష్ప జాతులు పుష్పించటం జరుగుతోంది. ఇంతకు ముందు కురింజి పుష్పాలు నీలగిరి కొండలు, బాబా బుదాన్ గిరి, ఏలకుల కొండలు, పళని కొండలు అనమలాయి కొండలలో విస్తారంగా ఉండేవి. కర్ణాటకలోని చిక్ మంగళూరు, దత్తపీఠం లోని చంద్రద్రోణ కొండ శ్రేణి అంతా ఈ పూల వల్ల ఊదా రంగులో కనిపిస్తుంది.
పశ్చిమ కనుమల్లో కురింజి పూల తేజోమయ శోభ
Neelakurinji Flowers : పశ్చిమ కనుమలతో పాటు తూర్పు కనుమలలో ఇడుక్కి జిల్లా, అగలి కొండలు, పాలక్కాడ్, కర్ణాటకలోని బಳ್ಳారిలోని సందురు కొండలలో ఇవి కనిపిస్తాయి. ఊటీలో 33 రకాల కురింజి పుష్ప జాతులు ఉన్నట్లు అంచనా. ఊటీతో పాటు కూనూరు, లాంబ్స్ రాక్, కొత్తగిరిలో నీలం రంగులో ప్రకాశవంతమైన ఈ పుష్ప జాతులను చూడవచ్చు. బ్రిటీష్ శకానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు జేమ్స్ సైక్స్ గాంబ్లే తన పుస్తకం- ‘ఫ్లోరా ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ’ లో 46 జాతులను వివరించారు.
కేరళలోని మున్నార్ కురింజి పువ్వులు విరివిగా పూస్తాయి. మున్నార్ లోయ ఆకాశ నీలం రంగు పూల అందంతో భూతల స్వర్గంగా కనిపిస్తుంది. దేవభూమిగా పిలిచే కేరళ వాసులకు నీల కురింజి పుష్పశోభ ఒక వరం. నీల కురింజి పుష్పాల కారణం గా నీలగిరి అనే పేరు ఆ పర్వతాలకు వచ్చింది. మున్నార్లోని ఎరవికులం జాతీయ ఉద్యానవనం నీల కురింజిలకు ఆవాసం. కర్ణాటకలోని కొడగు (కూర్లు) జిల్లాలో మందల్పట్టి, కోటెబెట్టా కొండల్లో ఈ పూలు పన్నెండు ఏళ్లకు ఒకసారి పూస్తాయి. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే కూర్గుకు వచ్చి అక్కడి నుండి కొండలకు పర్యాటకులు వెళ్తారు.
పర్యాటక ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ అవసరం
డబ్బు ఉండాలేగానీ ఈ పూలను ఆకాశం నుండి చూసేందుకు ఈసారి హెలికాప్టర్ టాక్సీలు కూడా ఉన్నాయి. హెలీటాక్సీ సంస్థ,తుంబె ఏవియేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఈ ఆఫరు ఇస్తోంది. హెలికాప్టర్లలో కొండలపై ట్రిప్ వేసేందుకు అధిక మొత్తంలోనే చార్జి చేస్తున్నారు. మైసూరు తీర పట్టణం మంగళూరు మధ్య అందమైన హిలేషన్ అయిన ఈ కూరు చుట్టూ బ్రహ్మగిరి కొండలు వ్యాపించి ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే సతత హరితారణ్యాలు ఇక్కడి ప్రత్యేకత.

అడవుల్లో అనేక పక్షులు, జంతువులు అరుదైన పుష్పజాతులు కనిపిస్తాయి. కాఫీ తోటలకు కూరు ప్రసిద్ధి. లక్షలాది పుష్పాలు ఒకసారి వికసించడంతో మందల్ పట్టి కొటెబెట్ట పర్వతాలు సుమనోహిందువుగా మారిపోయింది. హర శోభతో సందర్శకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. తమిళనాడులో కురింజి ఆండవన్ దేవాలయం కొడైకెనాల్ సరస్సుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింజి ఆండవన్- పర్వత దేముడు మురుగన్ ఆలయం ఇది. దీనిని ఒక యూరోపియన్ మహిళ 1936లో నిర్మించి భారతదేశంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తరువాత ఈ నీల కురింజి పుష్పశోభ గురించి ప్రస్తావించవచ్చు. అరుదైన ఈ కురింజి పుష్పాలు పన్నెండు ఏళ్లకు ఒకసారి కనిపిస్తాయి కనుక ప్రకృతి ప్రేమికులు అరుదైన ఈ పుష్పజాతులను తిలకించేందుకు పశ్చిమ కనుమలకు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో కురింజి పుష్పాలు వికసించే షోలా అడవులు ఉన్న హిల్ స్టేషన్కు తరలివస్తారు. అరుదైన అవకాశాన్ని అపురూపమైన ఈ పుష్ప శోభను తమ కెమెరాల్లో బంధించి మరో పన్నెండేళ్ల కోసం నిరీక్షిస్తూ ఈ సందర్శనను మరపురాని తీపి జ్ఞాపకంగా పదిలపరచుకుంటారు.(Neelakurinji Flowers)
Read This : https://vaartha.com/category/sunday-magazine/
Read Also : Padmanabhaswamy Temple Treasure : ఆలయాల్లో అనంత సంపద