Gen Z generation: గడచిన పావు శతాబ్దంలో అంటే 2000 నుండి 2025 సంవత్సరం వరకు మన సమాజంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. ఇప్పుడు 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ మార్పులు కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, మనుషుల ఆలోచనా దృక్పథాలలో, జీవన విధానంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 2జీ ఫోన్లు ఉంటే, ఇప్పుడు 5జీ వచ్చింది. అలాగే మన తాతల, తండ్రుల తరం అంటే జన్ఎక్స్, జన్వై నుండి ఇప్పుడు ‘జన్ జడ్’ అంటే పుట్టిన పిల్లల తరం వరకు ఆలోచనల్లో చాలా తేడా వచ్చింది. తరాలతో పాటు తరాల మధ్య అంతరాలు కూడా పెరుగుతున్నాయి. నేటి తరం ప్రపంచీకరణ, టెక్నాలజీ వేగం కారణంగా తమ ముందు తరాల కంటే భిన్నమైన విలువలు, కోరికలు, నైపుణ్యాలతో బతుకుతున్నారు. అందుకే మాట్లాడే విధానం, పనిచేసే పద్ధతి, బతుకుపై నమ్మకంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. జెన్ జెడ్ తరం సంప్రదాయ ఆలోచనలు, నియమాలు, డిజిటల్ విప్లవం చెరో పక్క ఉన్న సమయంలో పుట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని తమ అరచేతిలో చూస్తూ పెరిగారు. వీరికి సాంకేతికత అనేది వారి ఆలోచనలు, స్నేహాలు, ఉద్యోగాలపై అంచనాలను నిర్దేశించే ఒక భాగం అయింది. అందుకే వీరు దేనినైనా క్షణాల్లో తెలుసుకోగలరు. కానీ అదే సమయంలో ఏకాగ్రత తక్కువగా ఉండి త్వరగా విసుగు చెందుతారు. పాత తరం వారిలా కాకుండా వీరు తమకు ఇష్టమైన పనిని చేస్తూ, తొందరగా ఆర్ధికంగా ఎదగాలని, తమ దారిని ఎవ్వరూ నియంత్రించకుండా స్వేచ్చగా ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం జీతం కోసం మాత్రమే వీళ్లు బతకరు. తమ అభిప్రాయం ఏమిటో, తమ వాదన ఏమిటో చాలా బలంగా చెప్పే తరం ఇది. చిన్నప్పటి నుంచే ఆర్ధిక ఇబ్బందులు, వాతావరణ మార్పుల వంటి కష్టాలను చూసిన వీరు, పాత వ్యవస్థలను, పద్ధతులను ప్రశ్నించడానికి ఏమాత్రం భయపడరు. పాత తరాలు చెప్పిన దారిలో కాకుండా, తమకంటూ కొత్త దారిని సృష్టించుకోవాలని, సమాజంలో మార్పుకు తామే నాయకులుగా ఉండాలని బలంగా కోరుకునే తరం ఈ జెన్ జెడ్

తరాల పేర్లు ఇలా..
1946 ల 1960 మద్య పుట్టిన తరాన్ని ‘బేబీ బూమర్స్’ అని, ఆ తర్వాత నుండి 1970ల మధ్యలో పుట్టిన వారిని ‘జనరేషన్ ఎక్స్’ అని, 1980ల మొదలు నుండి 1990ల మొదలు వరకు పుట్టిన వారిని ‘జనరేషన్ వై’ లేదా ‘మిలీనియల్స్’ అని పేరు పెట్టారు. ప్రస్తుత యువతరం అంటే 1990ల మధ్యకాలం నుండి 2010ల ప్రారంభం మధ్య మధ్య జన్మించిన వారిని “జనరేషన్ జెడ్(Gen Z generation)” లేదా “జన్జడ్’ అని పిలుస్తున్నారు. ఇంగ్లీష్ అక్షరాల వరుసలో ‘వై’ తర్వాత ‘జెడ్’ వస్తుంది. ఈ క్రమాన్ని అనుసరించి ఈనాటి తరం వారికి ఈ పేరు పెట్టారు. వీరికి ‘ఐజెన్’ లేదా ‘సెంటెన్నియల్స్’ అనే ఇతర పేర్లుతో కూడా పిలుస్తారు.
మన దేశంలో వీరి బలం
మన దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చే శక్తి వీరికి ఉంది. కొత్త ఆలోచనలు, టెక్నాలజీతో అనుబంధం, ఆశయాల పరంగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ యువకులు భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగాన్ని, సాంకేతిక అభివృద్ధిని నడిపించబోతున్నారు.
మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం అంటే సుమారు 40 కోట్ల మంది ఈ జెన్జడ్ వారే ఉన్నారు. అందుకే వీరు ఎన్నికల నుండి వస్తువుల మార్కెట్ వరకు అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపిస్తున్నారు. పాత తరాల వారికి కంప్యూటర్లు, ఇంటర్నెట్ కొత్తగా అనిపించాయి కానీ వీరికి అవి కొత్త కాదు. అందుకే వీరి జీవనశైలి అంతా ‘మొబైల్ ఫస్ట్’ పద్ధతిలోకి మారిపోయింది. ఏదైనా చూడాలన్నా, వస్తువులు కొనాలన్నా, ఉద్యోగం వెతకాలన్నా ముందుగా మొబైల్నే ఆశ్రయిస్తారు. కొత్త టెక్నాలజీలను త్వరగా నేర్చుకోవడం వీరి ప్రత్యేకత. ప్రతి పని చాలా వేగంగా, సులభంగా, ఇబ్బంది లేకుండా డిజిటల్గా జరిగిపోవాలని బలంగా కోరుకుంటారు. ఈ ఆలోచనా విధానం వారి ఖర్చు పెట్టే అలవాట్లనే కాక, డబ్బు సంపాదించాలనే ఆలోచనను కూడా ప్రభావితం చేసింది. పాత తరాలు స్థిరమైన ఉద్యోగం, భద్రత కోరుకుంటే, ఈ జెన్జడ్ తరం భద్రతతో పాటు స్వేచ్ఛ, తమకు ఇష్టమైన పనిచేయాలని కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా వంటి చోట్ల జెనెజెడ్ యువత ప్రభుత్వాలపై కోపంతో నిరసనలు, ఆందోళనలు చేసారు. కానీ మన దేశంలోని యువత కొత్త ఆలోచనలు, కొత్త స్టార్టప్లు పెట్టడం, దేశాన్ని అభివృద్ధి చేసే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. భారతీయ యువత నినాదాలకు బదులు కొత్త కంపెనీలను; తిరుగుబాటులకు బదులు మార్పులను ఆయుధాలుగా చేసుకుందని ఒక అధ్యయనం తెలిపింది. దీనికి ముఖ్య కారణం దేశంలో ఎక్కువ సంఖ్యలో యువకులతో పాటుగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు ఉండటం. గత పదేళ్లలో ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలో యువతకు స్టార్టవ్లలో మంచి అవకాశం కల్పించింది.

మేల్కొన్న తరం
ఈ జెన్డ్(Gen Z generation) తరం కేవలం తమ ఉద్యోగాలు, జీవితాల గురించే కాకుండా రాజకీయాలు, సమాజంలో జరిగే మంచి చెడుల గురించి కూడా బలంగా ఆలోచిస్తోంది. సమాజంలో అందరికీ న్యాయం జరగాలని, పర్యావరణం దెబ్బతినకుండా కాపాడాలని కోరుకుంటున్నారు. వీరి పోరాటం కేవలం ఫోన్లలో చర్చించుకోవడం వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలలో మార్పులు తీసుకురావాలని కృషి చేస్తున్నారు.
సైడ్ హస్సెల్స్ అదనపు ఆదాయ మార్గాలు
మన దేశ జెన్డ్ యువతలో కేవలం జీతం కోసం ఉద్యోగం వెతుక్కోవడానికి బదులు, సైడ్ హస్సెల్స్’ అంటే పూర్తి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న పనులు చేస్తున్నారు. చిన్న ఆన్లైన్ వ్యాపారాలు మొదలుపెట్టడం, వీడియోలు, కంటెంట్ తయారు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. వీరి సంపాదన ఎప్పుడూ ఒకేలా ఉండదనే భయం, డిజిటల్ మాధ్యమాల ద్వారా త్వరగా డబ్బు సంపాదించవచ్చనే స్వేచ్ఛ ఈ ధోరణికి కారణాలు. ఒక నివేదిక ప్రకారం స్థిరమైన జీతం కోసం ఒక పూర్తి ఉద్యోగం చేస్తూనే తమకు ఇష్టమైన పనిని స్వేచ్చగా చేస్తున్నవారు సుమారు 43 శాతం మంది ఉన్నారు. ఈ విధంగా రెండు పనులు చేసుకునే పద్ధతి కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడానికే కాక, తమ ఇష్టాన్ని కూడా వృత్తిగా మార్చుకోవడానికి దారితీస్తోంది. ఈ క్రియేటర్ ఎకానమీ ఇప్పుడు కొంతమందికి ప్రధాన వ్యాపారంగానే మారింది.
పని చేసే విధానంలో పెను మార్పులు
ఇప్పుడిప్పుడే కార్పొరేట్ ఉద్యోగాలలోకి వస్తున్న వీరు పని అంటే ఏమిటి అనేదాని నిర్వచనాన్ని మార్చేస్తున్నారు. ముందు తరాల వారికి భిన్నంగా ఆదాయం అనేది కేవలం జీతం కంటే ఎక్కువగా ఉండాలని నమ్ముతున్నారు. వీరి ఉద్యోగ ప్రాధాన్యతలు డబ్బు, చేస్తున్న పనిలో సంతోషం, వ్యక్తిగత శ్రేయస్సు చుట్టూ ఉంటున్నాయి. తమ బాస్లు ప్రతి చిన్న పనిని కూడా దగ్గర ఉండి చూసుకునే పద్ధతిని అస్సలు ఇష్టబడడం లేదు. ఎంతసేపు పని చేశారనేదాని ఆధారంగా కాకుండా, ఎంత మంచి పని చేశారనే.. దాని ఆధారంగా తమ పనిని అంచనా వేసుకుంటారు. వారికి తమ ఇష్టం మేరకు పనిచేసే స్వేచ్ఛ, ఆ పనిలో ఒక అర్థం ఉండటం, పనిజీవితం మధ్య సరైన సమతుల్యం కావాలి. త్వరగా ఎదుగుతూ, కొత్త విషయాలు నేర్చుకోవాలని, సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే సంస్థలు కూడా వారికి మార్గదర్శకత్వం ఇస్తూ, కఠినమైన నిబంధనలు కాకుండా కొంత సడలింపును ఇస్తున్నాయి. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే- మేనేజర్లను ఎంచుకునేటప్పుడు వారి నైపుణ్యం కంటే నిజాయితీ, మంచి వ్యక్తిత్వం ఐదు రెట్లు ముఖ్యమని వీరు భావిస్తారు. ఈ కారణాల వల్లే జెన్జడ్ ఉద్యోగుల్లో 48 శాతం మంది ఒక సంవత్సరంలోపే తమ ఉద్యోగాన్ని మార్చాలని చూస్తున్నారు.

టెంగ్లిష్ భాష మీమ్ సంస్కృతి
నేటి యువత మాట్లాడే విధానం ‘టెంగ్లిష్’ అంటే తెలుగు, ఇంగ్లీష్ పదాల కలయికతో మారిపోయింది. మాట్లాడేటప్పుడు తెలుగు పదాల మధ్య సులభంగా ఇంగ్లీష్ పదాలను వాడుతున్నారు. యువకులు తమ స్నేహితులతో మాట్లాడేటప్పుడు, ఆన్లైన్లో చాట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ పదాలను కలపడం మామూలైపోయింది. దీనికంటే ముఖ్యంగా, వీరి కమ్యూనికేషన్లో ఫన్నీ ఫొటోలు, వీడియో క్లిప్లు లాంటి ‘మీమ్ కల్చర్’ కొత్త భాషగా మారింది.ఇవి కేవలం నవ్వించడానికి మాత్రమే కాకుండా ఒక పూర్తి భావాన్ని చాలా త్వరగా, సరదాగా చెప్పడానికి ఉపయోగపడే కళ్ళ ముందు కనిపించే చిన్న చిన్న పదాల మాదిరిగా పనిచేస్తాయి. ‘నేను అలిసిపోయాను’, ‘నాకు చాలా ఒత్తిడిగా ఉంది..’ లాంటి పెద్ద మాటలను ఒకే ఒక్క ఫొటో లేదా మీమ్ సులభంగా చెప్పేస్తున్నారు.
వినోదమే కాదు.. విజ్ఞానానికీ ప్రాధాన్యం
మన దేశంలో దాదాపు 37.7 కోట్ల మంది యువత డిజిటల్ మాధ్యమాలను వాడుతున్నారు. అయితే తమ సమయాన్ని అంతా పూర్తిగా సోషల్ మీడియాలోనే గడపడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ యువకులు వారంలో డిజిటల్లో గడిపే సమయంలో ఇంటర్నెట్లో సినిమా, టీవీషోలు, ఓటీటీ, పాటలు వినే యాప్లు, బ్లాగులు.. వంటి వాటిలో గడుపుతున్నారు. ముఖ్యంగా 90 శాతం తాము ఇష్టపడే విషయాల గురించి లోతుగా తెలుసుకోవడానికి ఈ వేదికలను వాడుతున్నారు. దీన్ని బట్టి, వీరు వినోదం కోసమే కాకుండా తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. అయితే, ఇంత లోతైన ఆసక్తి ఉన్నా, వీరి రోజువారీ కమ్యూనికేషన్లో మాత్రం చిన్న చిన్న వీడియోలు, రీల్స్, షార్ట్స్ ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
పాత వస్తువుల వాడకం
ఫ్యాషన్ విషయంలో ఈ జన్డ్(Gen Z generation) ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంది. ‘థ్రిఫ్టింగ్’ అంటే పాత. ఎవరైనా వాడిన వస్తువులను/బట్టలను కొనుగోలు చేయడం ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్గా మారింది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడానికి మాత్రమే కాదు. వాతావరణంలో జరుగుతున్న మార్పులను చూసిన ఈ తరం, వస్తువులను వృథా చేయకూడదనే ఉద్దేశంతో పర్యావరణానికి మేలు చేసే విధంగా ఇలా పాత వస్తువులను వాడుతున్నారు. థ్రిఫ్టింగ్ ద్వారా పాత వస్తువులను వాడటం అనేది స్టైలిష్ ఉండటంతో పాటు తెలివైన, పర్యావరణాన్ని కాపాడే మంచి పద్ధతిగా మారింది.

మానసిక ఆరోగ్య సంక్షోభం
మానసిక ఆరోగ్యం గురించి అందరి ముందు మాట్లాడటానికి ఈ తరం వెనుకాడకపోయినా, వీరు చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ యువతను ‘డిజిటల్ నేటివ్స్’ అని పిలిచినప్పటికీ, చిన్న చిన్న వీడియోలను నిరంతరం చూడటం వల్ల వారి ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిమిషాల క్లిప్లు నిరంతరం కొత్తదనాన్ని అందించడం వల్ల మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం విడుదలై మరింత వేగవంతమైన, కొత్త కంటెంట్ కోసం వెతుకులాటలో యువత చిక్కుకుంటున్నారు. దీనివల్ల దృష్టిని నిలకడగా ఉంచే శక్తి తగ్గిపోయి, ఎక్కువసేపు ఒకే విషయంపై ఏకాగ్రత పెట్టడం కష్టమవుతోంది. నిరంతరం ఫోన్లో కిందకు స్క్రోల్ చేయడం వల్ల ఈ తక్కువ ఏకాగ్రత అనే సమస్య పెరుగుతోంది.
ముందరి తరాల కంటే వీరిలోనే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో 49 శాతం మంది జెన్జెడ్(Gen Z) యువకులు ఎప్పుడూ ఆందోళనగా లేదా ఒత్తిడిగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ ఒత్తిడికి ముఖ్య కారణం విద్యారంగంలో అపారమైన అంచనాలు. మన దేశంలో ఇప్పటికీ చదువులో మంచి మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు సాధించడమే భవిష్యత్తును నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. ప్రవేశ పరీక్షల ఒత్తిడి, ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకోవాలనే భారం లాంటివి యువతలో దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడిని పెంచుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలని ఆశించడం వైఫల్యం భయాన్ని పెంచుతోంది. యువతులు తరచుగా పెళ్లి, కుటుంబ బాధ్యతలు గురించి సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటే, యువకులు కుటుంబాన్ని పోషించాల్సిన ప్రధాన భారాన్ని అనుభవిస్తున్నారు. మానసిక నిపుణులు చెబుతున్నట్టు ఇంట్లో గొడవలు, సరైన మాటామంతీ లేకపోవడం, స్వేచ్ఛను ఇవ్వకపోవడం వంటివి కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఒత్తిళ్ల కారణంగా భారతీయ యువతలో ఆత్మహత్య ఆలోచనలు, ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
కనుమరుగవుతున్న ‘జీవ గ్రంథాలయం’
భారతీయ సమాజం ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన పరివర్తన దశలో ఉంది. ఒకవైపు సాంకేతిక విప్లవం, ప్రపంచీకరణ, ఆర్ధిక ప్రగతి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుండగా మరోవైపు తరతరాలుగా మనగలిగిన ఒక అద్భుతమైన జీవన విధానం నిశ్శబ్దంగా కనుమరుగవుతోంది. ‘కనుమరుగవుతున్న పెద్ద తరం’ అనేది కేవలం వృద్ధాప్యంతో ఉన్న వ్యక్తులు చనిపోవడం అనే జీవసంబంధమైన ప్రక్రియ మాత్రమే కాదు. అది అపారమైన అనుభవం, తట్టుకునే శక్తి, ప్రకృతితో మమేకమైన జీవనశైలి, మానవీయ విలువలతో కూడిన ఒక ‘జీవ గ్రంథాలయం’ కాలిపోవడంతో సమానం. భారతీయ సమాజ మూలస్తంభం ‘సమిష్టితత్వం’. పాశ్చాత్య దేశాల వ్యక్తివాదానికి భిన్నంగా, భారతీయ సంస్కృతి పరస్పర ఆధారపడటం, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. గత తరంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక బలమైన మానసిక రక్షణ కవచంగా పనిచేసేది. ఒకే కప్పు కింద మూడు లేదా నాలుగు తరాలు కలిసి జీవించడం వల్ల, కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ భారం పంచుకునేవారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వృద్ధులకు, పిల్లలకు ఈ వ్యవస్థ ఒక అద్భుతమైన వనరుగా ఉండేది. పరిశోధనల ప్రకారం, ఉమ్మడి కుటుంబాలలో పెరిగిన కౌమారదశ పిల్లలు, న్యూక్లియర్ కుటుంబాల పిల్లలతో పోలిస్తే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని, అధిక భావోద్వేగ పరిపక్వతను కలిగి ఉన్నారు.
నశించిన ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ప్రభావం
నేటి జెన్జడ్(Gen Z generation) తరం ప్రధానంగా న్యూక్లియర్ కుటుంబాలలో పెరుగుతోంది. పట్టణీకరణ, ఉద్యోగ రీత్యా వలసల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. దీని ఫలితంగా నేటి తరం తీవ్రమైన మానసిక ఒత్తిడిని, ఏకాంతాన్ని అనుభవిస్తోంది. ‘నేను’, ‘నా స్పేస్’ అనే భావన పెరిగింది. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలను పంచుకునే వాతావరణం ఉండేది, కానీ నేడు సోషల్ మీడియాలో వేలమంది స్నేహితులు ఉన్నప్పటికీ, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా లేని పరిస్థితి నెలకొంది. సాంప్రదాయ భారతీయ గృహ నిర్మాణంలో అరుగు/వరండా ఇంటి లోపలికి, బయటి ప్రపంచానికి మధ్య ఉండే ఒక ‘సంధి ప్రదేశం’గా ఉండేది. ఇది సామాజిక వేదికగా పనిచేసేది. నేటి పట్టణీకరణ నేపథ్యంలో అరుగులు మాయమయ్యాయి. వాటి స్థానంలో ఇతరులతో సంబంధం లేని ఏకాంత ద్వీపాలుగా బాల్కనీలు మిగిలిపోయాయి.

కనెక్టివిటీ కమ్యూనికేషన్
జెన్జడ్ తరం ‘డిజిటల్ కనెక్టివిటీలో మునిగిపోయి, ‘ఫిజికల్ కనెక్టివిట’ని కోల్పోయింది. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులు పెరిగాయి. కానీ ప్రత్యక్ష సంభాషణలు తగ్గాయి. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒక గదిలో ఉన్న వ్యక్తి మరో గదిలో ఉన్న వ్యక్తితో మెసేజ్ ద్వారా మాట్లాడుకునే విచిత్రమైన పరిస్థితి నేడు నెలకొంది. సాంకేతికత ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నామని భ్రమపడుతున్నప్పటికీ
మానసిక దూరం పెరుగుతూనే ఉంది. పరిశోధనల ప్రకారం ఆన్లైన్ కమ్యూనికేషన్ ముఖాముఖి సంభాషణ అందించే ‘నాన్వెర్బల్ క్యూస్’ను అందించలేదు, దీనివల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. భారతదేశం వంటి ‘హై కాంటెక్స్ట్ కల్చర్’లో పదాల కంటే హావభావాలకు, సందర్భానికి ఎక్కువ విలువ ఉంటుంది.
పోషకాహార వైపరీత్యాలు
Gen Z generation: గత తరానికి చద్దన్నం లేదా పులియబెట్టిన అన్నం అనేది రోజువారీ ఆహారంలో ఒక భాగం. చాలామంది దీనిని పేదల ఆహారంగా పొరబడతారు. కానీ ఇది పోషకాల గని. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అన్నాన్ని పులియబెట్టడం వల్ల అందులో విటమిన్ బి12, ఐరన్, పొటాషియం స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది ఒక సహజమైన ‘సింబయోటిక్ అంటే ప్రో బయోటిక్, ప్రీ బయోటిక్ మిశ్రమంగా పనిచేస్తుంది. నేటి జెన్జడ్ ఆహారపు అలవాట్లు పూర్తిగా పాశ్చాత్యీకరించబడ్డాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్లో ఓట్స్, కార్న్ ప్లేక్స్ లేదా బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవడం ఫ్యాషన్ అయ్యింది. మధ్యాహ్నం, రాత్రి పిజ్జా, బర్గర్ వంటి ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ ఆహారాల్లో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువ. దీని పర్యవసానంగా యువతలో స్థూలకాయం, మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతున్నాయి.గతంలో ప్రతి ఇంట్లో మట్టికుండ ఉండేది. మట్టికుండ నీటిని సహజంగా చల్లబరచడమే కాకుండా, మట్టిలోని ఖనిజాలు నీటిలో చేరి, నీటిని ఆల్కలైన్గా మారుస్తాయి. కానీ నేడు, మనం స్వచ్ఛత పేరుతో ఆర్వో అంటే రివర్స్ ఓస్మోసిస్ నీటిపై ఆధారపడుతున్నాం. ఈ ప్రక్రియ శరీరానికి అత్యవసరమైన కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా తొలగిస్తుంది. దీనిని ‘డీమినరలైజ్డ్ వాటర్’ అంటారు. దీర్ఘకాలికంగా ఈ నీటిని తాగడం వల్ల ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పాత తరం వారు ఆరుబయట నిద్రించడం వల్ల శరీరంలోని ‘జీవ గడియారం’ ప్రకృతితో అనుసంధానించబడేది. నేటి జెన్జడ్ తరం పూర్తిగా ఎయిర్ కండిషనర్లపై ఆధారపడుతోంది. ఏసీ గదుల్లో గాలి ప్రవాహం తక్కువగా ఉండటం, రాత్రిపూట మొబైల్ ఫోన్ల నుండి వెలువడే ‘బ్లూ లైట్’ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకోవడం వల్ల నిద్రలేమి, నిద్ర చక్రం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తున్నాయి. మన పెద్దల కాలంలో ఒక వస్తువును కొంటే అది జీవితకాలం ఉండాలని కోరుకునేవారు. ఏదైనా వస్తువు పాడైతే, దాన్ని వెంటనే పారేయకుండా బాగుచేయించి వాడేవారు. దీనిని ఒక పెద్ద రిపేర్ ఎకానమీగా తెలపొచ్చు. వస్తువులను పంచుకోవడం ఒక సాధారణ సామాజిక ఆచారం. ఈ జీవన విధానం వెనుక ఉన్నది పేదరికం కాదు. వస్తువుల పట్ల గౌరవం, పొదుపు తత్వం. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసేది. అయితే జెన్జడ్ తరం వినియోగదారీ సంస్కృతిలో మునిగిపోయింది. వస్తువు పాడైతే బాగుచేయించడం ఖరీదైన వ్యవహారంగా, కొత్తది కొనడం సులభంగా మారింది.
బాల్యం ఒక ప్రాజెక్ట్ గా మారింది
గతంలో పిల్లల సాయంత్రాలు ఆటస్థలాల్లో గడిచేవి. కబడ్డీ, ఖోఖో వంటి శారీరక శ్రమతో కూడిన ఆటలతో పాటు నాటకాలు, బుర్రకథ వంటి కళారూపాలను వీక్షించేవారు. ఈ ఆటలు పిల్లల్లో సామాజిక నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, ఓటమిని తట్టుకునే శక్తిని సహజంగానే పెంపొందించేవి. నేటి తల్లిదండ్రులు ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి వారు ‘హెలికాప్టర్ పేరెంటింగ్’ విధానాన్ని అవలంభిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు పట్ల అతిగా ఆందోళన చెందుతూ, వారి ప్రతి అడుగును నియంత్రిస్తున్నారు. పిల్లలకు ‘ఫ్రీ ప్లే’ లేక పోయింది. వారి సమయం అంతా స్కూలు, ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లతో నిండిపోయింది. ఈ “ఓవర్హెడ్యూలింగ్” వల్ల పిల్లల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థం లోపిస్తున్నాయి. వారు చిన్న వైఫల్యాలను కూడా తట్టుకోలేకపోతున్నారు. విద్యాపరంగా చూస్తే కార్పొరేట్ స్కూళ్ల పరుగుపందెంలో పడి, పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు. బాల్యం అనేది ఒక ‘అనుభవం’ నుండి ఒక ‘ప్రాజెక్ట్’గా మారిపోయింది.గూగుల్ ద్వారా ప్రపంచంలోని ఏ సమాచారమైనా క్షణాల్లో లభిస్తోంది, కానీ ఆ సమాచారాన్ని ఎలా వాడాలో, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే విచక్షణ లోపిస్తోంది. నేటి తరం ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్తో సతమతమవుతోంది. సమాచారం ఉంది కానీ జ్ఞానం లేదు. కనెక్టివిటీ ఉంది కానీ కమ్యూనికేషన్ లేదు. పెద్ద తరం మనకు వదిలి వెళ్తున్నది కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు. ఒక హెచ్చరిక కూడా. వారు పాటించిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సామాజిక విలువలు అశాస్త్రీయమైనవి కావు, అవి శతాబ్దాల అనుభవ సారం. జెన్జడ్ తరం సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత ఎదిగినా, మానసికంగా, శారీరకంగా బలహీనపడుతున్నట్లు అనేక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మనం చేయాల్సింది పూర్తిగా పాత రోజులకు తిరిగి వెళ్లడం కాదు. అది సాధ్యం కూడా కాదు. కానీ ఆ పాత తరంలోని శాస్త్రీయతను, మంచిని నేటి ఆధునికతకు జోడించడం అత్యవసరం.
తరాల మధ్య వారధి నిర్మాణం
పాత తరం పెద్దలు, కొత్త తరం(Gen Z generation) యువత మధ్య ఏర్పడే ఘర్షణ కేవలం వ్యక్తిగత అహం కాదు. అది సామాజిక, సాంకేతిక, మానసిక మార్పుల ప్రభావం. ఈ వైరుధ్యానికి ప్రధాన కారణం సాంకేతిక విప్లవం. కొత్త తరం డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగింది. పాత తరం సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే, కొత్త తరం స్వేచ్ఛ, వ్యక్తిగత గుర్తింపు, వృత్తిపరమైన సంతృప్తి, పనిజీవిత సమతుల్యతకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. చివరిది తరాల మధ్య సంభాషణలో అంతరం ఏర్పడటం. పెద్దలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటే, యువత.. ఎందుకు? అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఆశిస్తున్నారు. అయితే యువత తమ ఆలోచనలను, అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరిచే ధైర్యం కలిగి ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలకు మంచి లక్షణం.

పరిష్కార మార్గాలు
తరాల మధ్య దూరాన్ని తగ్గించి, బలమైన బంధాన్ని ఏర్పరచడానికి మొదటగా, క్రియాశీలక శ్రవణం అవసరం. పెద్దలు యువతరం చెప్పేది తీర్పు ఇవ్వకుండా పూర్తిగా వినాలి. అదే విధంగా యువత పెద్దల అనుభవాన్ని గౌరవించాలి. ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. రెండవ పరిష్కారం పరస్పర బోధన. యువత పెద్దలకు సాంకేతికత అంటే స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ నేర్పించాలి. ప్రతిగా పెద్దలు తమ జీవిత అనుభవాలను, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలను యువతకు అందించాలి. ఈ మార్పిడి ఇద్దరినీ బలోపేతం చేస్తుంది. దీనికితోడు, కుటుంబంలో సమాజంలో ఉమ్మడిగా సమయం గడపడానికి అవకాశం కల్పించడం ద్వారా ఉమ్మడి వేదికలు సృష్టించాలి.
చివరగా మార్పును ఆలింగనం చేసుకోవడం చాలా ముఖ్యం. పాత తరం తాము నివసించిన ప్రపంచం ఇప్పుడు లేదని అంగీకరించి, మార్పును స్వీకరించాలి. అదే విధంగా, యువతరం సంస్కృతి, చరిత్ర పెద్దల త్యాగాలను వారసత్వంగా గౌరవించాలి. ఈ పరస్పర గౌరవం ద్వారానే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కొత్త తరం ఎదురు తిరగడం అనేది విచ్చిన్నానికి సంకేతం కాదు, ఇది పరివర్తనకు సంకేతం. పాత తరం అనేది బలమైన వేరు అయితే, కొత్త తరం అనేది ఆ వేరు నుండి పైకి ఎదిగే ఉజ్వలమైన రెమ్మ. ఈ రెండూ కలిస్తేనే జీవన వృక్షం సంపూర్ణంగా ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: