Mukti Kshetram Sri Vishnu Padagaya: యుగ యుగాల నుండి గయ హిందువులకు అత్యంత పవిత్ర ప్రదేశం. జన్మ జన్మల పాపాలను హరించే ముక్తి క్షేత్రంగా శతాబ్దాలుగా ప్రశస్తి చెందింది. ఇంతటి ప్రాముఖ్యం రావడానికి సంబంధించిన పౌరాణిక గాథలు అన్ని యుగాలకు చెందినవి. వాయు, గరుడ, కూర్మ, పద్మ, వరాహ పురాణాలతో పాటు రామాయణ, మహా భారతాలలో ప్రస్తావించబడ్డాయి.
పౌరాణిక గాథ
సత్య యుగంలో గయాసురుడు అనే అసురుడు అమిత విష్ణు భక్తుడు. తన ఇష్టదైవం అనుగ్రహంతో తన శరీరాన్ని తాకినవారు ముక్తిని పొందే వరం పొందాడు. తన మరణం ఒక్క త్రిమూర్తుల చేతిలోనే సంభవించాలన్న చిత్రమైన మరో వరం కూడాదక్కించుకొన్నాడు. వర ఫలం అందరికీ దక్కాలన్న సదుద్దేశంతో తన శరీరాన్ని విపరీతంగా పెంచసాగాడు.
అసురుని విపరీత చర్యలతో దేవతలు భయభ్రాంతులైపోయారు. కారణం ఏమిటంటే నరకం పూర్తిగా ఖాళీ అయింది. ప్రతిఒక్కరూ స్వర్గానికే చేరసాగారు. దేవతల అనుగ్రహం కోసం చేసే యజ్ఞ యాగాదులు సంపూర్ణంగానిలిచిపోయాయి. దేవతలు అశక్తులుగా మారిపోయారు. దేవతల విన్నపాల మేరకు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలలో గయాసురుని వద్దకు వెళ్లారు. ఉచిత రీతిన అతిథి సత్కార్యాలు చేసిన తరువాత అతను వారి రాకకు కారణం అడిగాడు.
లోకాలకు మేలు కలిగించే దివ్యమైన యాగం ఒకటి చేయ తలపెట్టామని దానికి తగిన స్థలాన్వేషణలో ఉన్నామని తెలిపారు. ఈ భూమండలంలో ఎక్కడైనా వారు స్థలాన్ని ఎంచుకోవచ్చని అసురుడు హామీ ఇచ్చాడు. తాకితేనే మోక్షాన్ని ప్రసాదించే అతని శరీరం కన్నా పవిత్ర స్థలం ఎక్కడ ఉంటుంది? అని వారు అనగానే తన దేహాన్ని యాగ వేదికగా వినియోగించుకోవడానికి సమ్మతించాడు.
అయితే వారం రోజుల పాటు నిర్వహించే యజ్ఞం సందర్భంగా గయాసురుడు కదలకూడదు. కదిలితే యాగం భగ్నం అవుతుంది. దానికి తగిన ఫలితాన్ని రాక్షసుడు అనుభవించాలి. అన్ని నిబంధనలకు అంగీకరించి, తన శరీరాన్ని పెంచి యజ్ఞ నిర్వహణకు అనువుగా పడుకొన్నాడు. త్రిమూర్తులు హోమం వెలిగించి…క్రతువును ఆరంభించారు. ఆరు రోజులు (days) గడిచిపోయాయి. గయాసురునిలో ఎలాంటి చలనం లేదు. ఒక్కరోజు గడిస్తే అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎలాగైనా అసురుని కదలించాలన్న నిర్ణయంతో ఇంద్రుడు కోడిలా మారి పెద్దగా కూత పెట్టాడు. గడువు పూర్తయిందని భావించిన గయాసురుడు కదిలాడు. దేవతలు అతని శరీరం మీద పెద్ద శిలను ఉంచారు. దాని మీద శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని అదిమిపెట్టారు.
తన అంత్య కాలం (period) సమీపించిందని అతనికి అర్థమైంది. నిశ్చల మనస్సుతో శ్రీహరిని ప్రార్థించాడు. బ్రహ్మ, శివ సమేతంగా శ్రీనివాసుడు తమ నిజ రూపాలతో దర్శనమిచ్చి మరణానంతరం కూడా అతని శరీరం పవిత్రమైనదిగా నిలుస్తుందని, ఎవరైతే గయా క్షేత్రం సందర్శిస్తారో వారి జన్మ జన్మల పాపాలు హరించిపోతాయని, గతించిన వారికి ఈ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే సద్గతులు కలుగుతారని వరం ప్రసాదించారు.

అలా గయాసురుని తల ఉన్న ప్రాంతాన్ని అతని పేరు మీద గయ (శిరోగయ) అని, బొడ్డు ఉన్న ప్రదేశం నాభిగయ (బిరజాదేవి, జాజ్పూర్, ఒడిస్సా) అని, పాదాలు ఉన్న స్థలం పాదగయ (పిఠాపురం) గా పిలవసాగారు. నాటి నుండి ప్రజలు తమ పూర్వీకులకు సద్గతులు కలగడానికి, తమ జీవితకాలంలో చేసిన కర్మల నుండి విముక్తి కలగడానికి గయా క్షేత్రం సందర్శిస్తున్నారు. రామాయణంలో శ్రీరామచంద్రులు తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణాలు విడిచి, పిండప్రదానం చేసినట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారందరికీ తిల తర్పణాలు, పిండప్రదానం చేసినట్లు తెలుస్తోంది.

ఫాల్గు నది
శ్రీ విష్ణుపాద ఆలయం గయలో ‘ఫాల్గు నది’ ఒడ్డున ఉంటుంది. శ్రాద్ధ కర్మలను ఈ నదీ తీరంలోనే నిర్వహిస్తారు. గంగతో సమానంగా భావించే ఈ నది సాక్షాత్తు విష్ణు స్వరూపమని విశ్వసిస్తారు. ఫాల్గు అంటే కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు అని అర్థం. వ్యాసభగవానులు మహాభారతంలో ఈ నదిని ‘నిరంజర’గా పేర్కొని మహిమను విపులంగా వివరించారు.
గయకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ‘కోరంబే పహార్’గా పిలిచే పర్వతాలలో ఉద్భవించే ‘లిలజన్’ (నిరంజర), ‘మోహన’ అనే రెండు నీటి ప్రవాహాలు గయ వద్ద సంగమించి ‘ఫాల్గు’ నదిగా మారతాయి. ఆలయానికి పడమర దిశలో ఉన్న నదీ తీరానికి సులభంగా చేరుకోవచ్చు. ఇంతటి పవిత్రతను ఆస్వాదించబడిన ఫాల్గు నది సంవత్సరంలో అధిక భాగం ఎడారిని తలపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక పురాణగాథ స్థానికంగా వినిపిస్తుంది.
శ్రీరాముడు లక్ష్మణ, సీతా సమేతులై పాదగయ వచ్చారట. అన్నదమ్ములు పిండప్రదాన కార్యక్రమానికి సిద్ధమవుతున్న సమయంలో జానకీదేవి నది ఒడ్డున కూర్చొని ఉన్నారట. ఆ కాలంలో పితృదేవతలు స్వయంగా వచ్చి పిండారాలను స్వీకరించి వారసులను OM ఆశీర్వదించి వెళ్లేవారని ప్రతీతి.
నీటి ప్రవాహంలో నుండి దశరథ మహారాజు వెలుపలికి వచ్చి కోడలిని పిండాలను ఇమ్మని అడిగారట. ఆయన కుమారులు క్రతువు చేయడానికి సిద్ధపడుతున్నారు, కొద్దిసేపు ఆగమని అభ్యర్థించింది సీతాదేవి. దశరథుడు “ఆగలేను, ఇప్పుడే కావాలని” పట్టుపట్టారట. స్త్రీ పితృకార్యం చేయకూడదు. అందులోనూ తన వద్ద ఎలాంటి వస్తువులు లేవు” అని తన అశక్తతను తెలియపరిచిందట.
“అయితే ఇసుకతో చేసిన పిండాలను నాకు సమర్పించు, ఫర్వాలేదు” అన్న మామగారి ఆత్మను సంతృప్తి పరచడానికి ఫాల్గు నది, అక్షయ వాట్, ఆవు, బ్రాహ్మణుడు, తులసిమొక్కను సాక్షులుగా ఉంచుకొని ఇసుకతో చేసిన పిండాలను దశరథునికి అందించిందట. వాటిని స్వీకరించి కోడలిని ఆశీర్వదించి అదృశ్యులు అయ్యారట దశరథుడు.

పితృకార్యం పూర్తి చేసిన తరువాత పిండాలను అందుకోవడానికి తండ్రి గారి ఆత్మ రాకపోవడంతో శ్రీరాముడు చింతించాడు. భర్తను ఓదారుస్తూ సీతాదేవి జరిగిన విషయం తెలియచెప్పింది. నమ్మలేదు దశరథ తనయుడు శ్రీరాముడు. తన సాక్షులను పిలవగా ఒక్క ‘అక్షయ…వాట్ తప్ప మిగిలిన నాలుగూ అబద్ధం చెప్పాయట. దాంతో ఆగ్రహించిన భుజాత ఫాల్గు నది నీరు లేకుండా పోవాలనీ, గోపృష్ట భాగమే పూజార్హమని, గయలో తులసికి స్థానం ఉండదని, ఇక్కడి బ్రాహ్మణులు క్రతువు కన్నా కాసుల మీద వ్యామోహంతో గౌరవాన్ని కోల్పోతారని శాపం ఇచ్చిందట. నాటి నుండి ఫాల్గు నది ఇసుక ఎడారి మాదిరిగా కనిపిస్తోంది. కార్యక్రమాల నిమిత్తం నదిలో లోతుగా గోతులు తీసి ఉబికిన నీటితో పూర్తి చేస్తారు. సహజంగా విష్ణు ఆలయాలలో కనిపించే తులసిమొక్క గయలో కనిపించదు. ఆవు పృష్ఠ భాగాన్నే పూజిస్తాం కదా! గయలో పాండాలు(పూజారులు) అధిక ధనం వసూలు చేయడానికి చెప్పే కథలకు అంతే లేదు. కాశీలోని హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్ లలో నిరంతరం ఎలా శవ దహనాలు జరుగుతుంటాయో అలాగే ఇక్కడ కూడా ఫాల్గు నది ఒడ్డున జరుగుతుంటాయి. పునఃజన్మ ఉండదు నమ్ముతారు.
అక్షయ వాట్
అక్షయ వాట్ ఒక వట వృక్షం. ఈ వృక్షం నాలుగు యుగాల నుండి ఉన్నదని ప్రచారంలో ఉన్న గాథ ద్వారా అవతగతమవుతోంది. పునఃసృష్టికి ముందు సంభవించిన జల ప్రళయంలో శ్రీ మహావిష్ణువు వట పత్రం మీద కాలిబొటన వేలిని నోటిలో ఉంచుకొని చిన్న బాలునిగా కనపడతారు. ఆయననే ‘వటపత్ర సాయి’ అని పిలుస్తారు. నాడు ఆయన శయనించిన పత్రం ఈ వృక్షానికి చెందినది అని ఆ గాథ తెలియచెబుతోంది. అందుకే అక్షయ వాట్ అన్న పేరు వచ్చింది. పితృ రుణం తీర్చుకొనే కార్యక్రమం కొంత ఇక్కడ నిర్వహిస్తుంటారు. త్రేతాయుగానికి ముందు నుండి ప్రజలలో విశేష ఆదరణ కలిగిన విష్ణు పాదగయ ఆలయాన్ని మొట్టమొదట ఎవరు నిర్మించారో తెలియదు. ఈ ప్రాంతాల మీద ఆధిపత్యం పొందిన ప్రతి ఆలయాభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది. పాత ఆలయాన్ని పునఃనిర్మించి ప్రస్తుత రూపంలో మనకు అందించినది మాత్రమే ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్. ఆలయానికి వెళ్లే మార్గంలో ఆమె పాలరాతి విగ్రహాన్ని గౌరవ సూచకంగా ఉంచారు. యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గృహానికి ఆమె పేరే పెట్టారు. ఈ విగ్రహం పక్కనే తెలుగువారి కోసం తెలుగువారు ఏర్పాటు చేసిన శ్రీ మంగళగౌరీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది.

ఆలయ విశేషాలు
ఆలయానికి కొద్ది దూరంలో ఉండే స్వాగత ద్వారం వద్ద నుండి నిలువుగా ఉండే విమాన గోపురం గుమ్మటంలా కనిపించే ముఖ మండపాలు ఆహ్వానం పలుకుతాయి. ఇక్కడ కుడి పక్కన చిన్న గుట్ట మీద శ్రీ కామాఖ్యదేవి మందిరం ఉంటుంది. ఆలయం వెలుపల ఎక్కువగా రంగులు, కార్యక్రమాలకు కావలసిన వస్తువులు అమ్ముతుంటారు. ప్రవేశ ద్వారానికి దశావతార రూపాలను సుందరంగా మలచి నిలిపారు. ప్రాంగణమంతా ఎన్నో రకాల విష్ణు రూప శిల్పాలు కనపడతాయి. చూడగానే అవి చాలా పురాతనమైనవని తెలిసిపోతుంది. ఆలయం నుండి నదీ తీరానికి వెళ్లే మార్గంలో అక్షయ వాట్ దాటిన తరువాత శ్రీ గయ గదాధరుని మందిరం, పక్కనే శ్రీ సాక్షి వేణుగోపాల స్వామి సన్నిధి వస్తాయి. శ్రీ గణపతి, శ్రీ నారసింహ, శ్రీ కైలాసనాథ, శ్రీ గౌరీ ఉపాలయాలు ఉంటాయి. ప్రధాన గర్భాలయం మధ్యలో ‘ధర్మశిల’గా పిలవబడే రాతి మీద సుమారు పదహారు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో శంఖు, చక్ర ముద్రలతో దర్శనమిస్తుంది విష్ణు పాదం. చుట్టూ వెండితో ఒక హద్దులా నిర్మించారు. భక్తులు నేరుగా తాకవచ్చు, పూజాదికాలు, అభిషేకాలు స్వయంగా చేసుకోవచ్చు.
గర్భాలయ అంతర్గోడలలో శ్రీ వినాయక, శ్రీ మహావిష్ణు, శ్రీ నారసింహ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహేశ్వరుడు, పార్వతీదేవి ఆది గల దేవీ దేవతా రూపాలను నిలిపారు. ఆలయానికి చేరువలో శ్రీరామసాగరం, శ్రీ దక్షిణార్క కుండం, వైతరణి వంటి కొనేరులు ఉంటాయి. ఇవన్నీ భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తాయని గ్రంథాల వల్ల తెలుస్తోంది. కానీ వాటి ప్రస్తుత స్థితి స్నానం చేసేవారిని అనారోగ్యంపాలు చేసేవిగా ఉన్నాయి. పరిశుభ్రపరచాల్సిన అవసరం, వాటి పవిత్రతను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిండప్రదానం గయకు ఈశాన్యంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ప్రేత శిల’ వద్ద…జరిపించాలట. ఇక్కడ ఉన్న బ్రహ్మ పుష్కరిణిలో స్నానం చేసినవారి బ్రహ్మహత్యా పాతకమైనా హరించుకొనిపోతుందని అంటారు. అయితే అక్కడ ఎవరూ స్నానం చేయడం లేదు. అంతా ఫాల్గు నది ఒడ్డునే చేస్తున్నారు. పితృ రుణం తీర్చుకోవడానికి దేశం నలుమూలలనుండి యాత్రికులు ప్రతిరోజూ వేలాదిగా గయకు తరలి వస్తుంటారు. భక్తిశ్రద్ధలతో తమ పితృ దేవతలకు తర్పణాలు, పిండదానాలు చేస్తుంటారు. అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు.
ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ మంగళగౌరీ ఆలయం శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి స్థానం పడినట్లుగా స్థల పురాణం వల్ల తెలుస్తోంది. ఇక్కడే మన పాప పుణ్యాలను లెక్క రాసే చిత్రగుప్త ఆలయం లాంటి పురాతన ఆలయాలు చాలా కనపడతాయి. ప్రధాన మందిరానికి సమీపంలోనే ఉన్న దక్షిణార్క (సూర్య) మందిరం తప్పక దర్శించాలి. మనం చేసే పితృ కార్యాలకు సాక్షిగా పురాణాలు పేర్కొన్న “శ్రీ ప్రపితామహేశ్వర మందిరం” తప్పనిసరిగా దర్శించాలి. విష్ణు పాద ఆలయ విమానంపై ఉన్న బంగారు కలశం, పతాక దర్శనాలు కూడా మోక్షదాయకాలని గ్రంథాలు తెలియపరిచాయి.

బీహార్ రాష్ట్రంలో రాజధాని పాట్నా తరువాత పెద్ద పట్టణమైన గయలో యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. ఆలయ సమీపంలో ఎన్నో సత్రాలు, యాత్ర నివాసాలు ఉంటాయి. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుండి రైల్లో నేరుగా గయకు చేరుకోవచ్చు. గయలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. గౌతమ బుద్ధుడు జ్ఞానోపదేశం పొందిన బౌద్ధ గయ ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎన్నో సంప్రదాయాల చిరునామా, మరెన్నో చారిత్రక విశేషాల సమాహారం అయిన గయ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం.
Read also: hindi.vaartha.com
Read also: