శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్న ప్రార్థనతో హిందువుల శుభకార్యాలు ఆరంభం అవుతాయి. ఈ శ్లోకాన్ని చదవగానే కలిగే సందేహం ఏమిటంటే ఇందులో స్తుతిస్తున్నది శ్రీ గణపతినా? లేక శ్రీ మహావిష్ణువునా? విష్ణుం అన్న పదం మరింతగా సందేహాన్ని పెంచుతుంది. హిందువులు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఆ రూపాలన్నీ నిరాకారుడైన పరమాత్మవే! అంతర్యామివే! ప్రతి రూపానికి తనవైన ప్రత్యేకతలు, విశేషాలు, కార్యసిద్ధి ఉన్నాయని మన పురాణాల వల్ల తెలుస్తోంది. ఈ శ్లోకానికి ఈ విధంగా అర్థం చెప్పుకోవచ్చు.. లోకానికి ఆధారమైన ఆకాశాన్ని తన అదుపులో ఉంచుకొన్నవాడు, చంద్ర కళలతో శుక్ల పక్ష, కృష్ణ పక్షాల మాదిరి ప్రజల సుఖ దుఃఖాలలో అండగా ఉండేవాడు. చతుర్భుజాలతో కాలాన్ని అధీనంలో ఉంచుకొన్నవాడు. ప్రసన్న వదనంతో ఉన్నవానిని అన్ని విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దేవతామూర్తికి తనదైన రూపం ఉన్నది అని అనుకొన్నాం కదా! ఆదిపూజ్యుడు అయిన గణపతి రూప విశేషాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? ఈ వివరాలన్నీ గణేశ పురాణం, గణపతి అధర్వ శీర్షం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణాలలో వివరించారు. అసలు గజ అన్న పదానికి విశేష విశ్లేషణ కనపడుతుంది. గ అంటే గతి. జ అంటే జన్మ. జన్మగతిని నిర్దేశించేవాడు గణపతి. ఏ నిరాకరుని నుండి ఉద్భవిస్తామో చివరికి ఆయనలోనే లీనమవుతాం.
గణపతి జన్మ రహస్యం
గజాసురుడు అనే అసురుడు పరమేశ్వరుని తన తపస్సుతో మెప్పించాడు. నిరంతరం తన హృదయ కుహరంలో నివాసముండాలన్న కోరిక కోరారట. భోళాశంకరుడు అంగీకరించి రాక్షసుని హృదయంలో స్థిరపడ్డారట. కైలాసంలో పార్వతీదేవి (Parvati devi) మహేశ్వరుని గురించి చింతిస్తూ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించినదట. భక్తుడైనా లోక కంటకుడైనందున రాక్షస సంహారానికి సకల దేవతలతో కలిసి శ్రీహరి, గజాసురుని మెప్పించారట. నందీశ్వరుడు వాడికొమ్ములతో రాక్షసుని హృదయాన్ని చీల్చి హృదయేశ్వరుని వెలుపలికి రప్పించారట. మరణానికి ముందు గజాసురుడు తన శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని కోరాడు. నందివాహనుని రాకను తెలుసుకొన్న పార్వతీదేవి అలంకరించుకోవడానికి స్నానం చేయడానికి వెళుతూ నలుగు పెట్టుకొన్న పసుపుముద్దతో ఒక బాలుని రూపాన్ని చేసి ప్రాణం (life) పోసి గుమ్మం దగ్గర కాపలా ఉంచింది. కైలాసంలోకి ప్రవేశించబోయిన కైలాసనాథుని అడ్డగించాడు బాలుడు. ఆగ్రహించిన రుద్రుడు అతని శిరస్సు ఖండించి లోపలికి వెళ్లాడు. అనంతర సమయంలో బాలుని ప్రస్తావన రావడంతో అమ్మవారి ఆవేదనను అర్థం చేసుకొన్న అర్ధనారీశ్వరుడు గజాసురుని శిరస్సును ఆ బాలుని దేహానికి అమర్చారు. వినాయకునిగా నామకరణం చేసి స్వంత కుమారునిగా స్వీకరించి శివగణాలకు అధిపతిగా నియమించారు. అలా గజముఖుడు గణపతిగా పిలవబడుతున్నాడు. ఈ గాథ మనందరికీ తెలిసిందే! కానీ కొన్ని గొప్ప ఆధ్యాత్మిక సందేశాలు కనపడతాయి. ఆ విషయాలు తెలుసుకొని ఆచరించుకోవలసి ఉన్నది. అమ్మవారు త్రిపుర శక్తులకు మూలం. కుండలినీ శక్తికి మూలాధారం. ఆమె నిరంతరం త్రిలోకేశ్వరుని ధ్యానంలో ఉంటుంది. ఆమె ఆరాధన సకల జీవులకు ముక్తిదాయకం. కాపలా పెట్టడం అన్నది దేవదేవి పట్ల భక్తునికి ఉండవలసిన భక్తికి నిదర్శనం. బాలుడు జీవం కోల్పోయాడు కానీ లోపలికి అనుమతించలేదు. సాధకునికి ఉండవలసిన ఏకాగ్రతకు, పరిపూర్ణ భక్తి విశ్వాసాలకు చిహ్నం. మరొక అంశం కూడా దిగి ఉన్నది. ఆదిదంపతులు ఏక స్వరూపులు. బాలుడు తనకు లభించిన పదవి వలన అహంకారంతో పరమేశ్వరుని గుర్తించలేదు. అహంకారం తొలిగితేనే పరిపూర్ణ భక్తి నెలకొంటుంది అంటారు పెద్దలు. అందుకే త్రినేత్రుడు బాలుని శిరస్సును ఖండించారు.

అహం తొలగిన వినాయకుడు గణాధిపత్యం కోసం సోదరునితో పోటీ పడినప్పుడు తల్లిదండ్రులను త్రిలోక పూజ్యులుగా గ్రహించి వారికి ప్రదక్షిణ చేశారు. గణాధిపత్యం అంటే సమస్త జీవుల మీద ఆధిపత్యం. అంటే అధికారం చెలాయించడం కాదు, వారి అందరి తత్వాలను రూపాలను తనవిగా చేసుకోవడం. అందుకనే తొలి పూజ గణాధిపతి అయిన గణపతికి చేయడం వలన సమస్త జీవుల అనుమతి, ఆశీర్వచనం పొందగలం. వినాయక పూజలో అనేక పత్రాలను ఉపయోగించడం కూడా ప్రకృతిలోని భూమి, నింగి, నీరు, నిప్పు, గాలిని గౌరవించడం కిందికి వస్తుంది.
వినాయక రూప విశేషాలు
శిల్ప, చిత్రకళలో వినాయక రూపం ప్రత్యేకంగా దర్శన మిస్తుంది. క్రీ.శ. రెండవ శతాబ్దపు గణపతి విగ్రహాలకు నేటి విగ్రహాలకు చాలా మార్పులు కనపడతాయి. ఒక్క భారతదేశంలోనే కాదు.. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, బాలి, ఇండోనేషియా, నేపాల్, టిబెట్, జపాన్, శ్రీలంక దేశాలలో కూడా నేటికీ గణపతి ఆరాధన కనపడుతుంది. వినాయకునికి ఉన్న గజవదనుడు (గజముఖుడు), వక్రతుండుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, మోదకహస్తుడు, మూషిక వాహనుడు అన్ని నామాలన్నీ ఆయన రూప విశేషాలే!
ఒక్కో నామానికి ఒక్కో ప్రత్యేకత.
గజవదనుడు:
గజాసురుని శిరస్సు ధరించడం వలన గజాననునిగా ప్రసిద్ధి చెందారు పార్వతీనందనుడు. గజ వదన దర్శనం అత్యంత పుణ్యప్రదం. మనోభీష్టదాయకం.ఉదయాన్నే గణపతి రూపాన్ని చూడటం వలన సమస్యలు తొలగిపోతాయని అంటారు. పురాణాలలో గజముఖం విశ్వ రహస్యాన్ని సూచిస్తుంది. అత్యంత శక్తివంతమైన శారీరక బలంతో గొప్ప మేధస్సుకు చిహ్నం. పెద్దదైన శిరస్సు మేధస్సుకు, చక్కని ఆలోచనలకు, వివేకానికి, విచక్షణకు సంకేతాలుగా పెద్దలు చెబుతారు. గజవదనుని పూజించడం వలన జ్ఞానం కలుగుతుంది అన్నది తరతరాల నమ్మకం. విద్యాభ్యాసానికి, అక్షరాభ్యాసానికి ముందు విద్యా వినాయకుని ప్రార్థించడం విధాయకం.
వక్రతుండుడు:
వంపు తిరిగిన తొండం ఓంకారం ప్రతిరూపం అని అభివర్ణిస్తారు. హిందువులకు ఓంకారం సర్వ శుభకరం. తొండం మనకు సహనాన్ని, ప్రశాంతతను నేర్పిస్తుందని అంటారు. ఆలయాలలో తొండం కుడి/ఎడమ వైపుకి తిరిగి ఉన్న వినాయక మూర్తిని చూస్తుంటాం. తొండం ఎడమ వైపుకి తిరిగి వుంటే వామ ముఖి గణేశుడు అని పిలుస్తారు. అలాంటి గణపతి రూపాన్ని సేవించడం వలన చంద్ర శక్తిని అందిస్తుందని అంటారు. ఆ శక్తి మనకు ఓర్పు, విచక్షణ, సృజనాత్మకత అందిస్తుంది. చాలా అరుదుగా కుడి వైపు తిరిగిన తొండంతో వినాయక దర్శనం లభిస్తుంది. దక్షిణాముఖి లేదా సిద్ధి వినాయకుడుగా దర్శనమిచ్చే స్వామి ఆరాధన మనలోకి సూర్యశక్తిని ప్రసరింపచేస్తుంది. అచంచల దైవభక్తి, ఇహ పర లోక సుఖాలను అంతిమంగా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయి. మోదక ప్రియ గణపతి ఇహలోక అంటే భౌతిక అవసరాలను శీఘ్రగతిన నెరవేరుస్తారని చెబుతారు.

శూర్పకర్ణుడు:
ఈ నామానికి నిఘంటువులో పేర్కొన్న అర్థం ఏనుగు అని. అంటే విశాలమైన వెడల్పాటి చెవులు కలిగినవాడు. పెద్ద చెవులతో సుందరంగా దర్శనమిచ్చే విఘ్ననాథుడు ఎంతటి చిన్న శబ్దాన్ని అయినా వినేవాడు అంటారు. దానికి అసలైన అర్థం ఎంత వింటే అంతటి జ్ఞానాన్ని సముపార్జించుకోవడంగా చెబుతారు. చక్కని శ్రోత ఎదుటివారి మాటల్లోని సారాంశాన్ని సంపూర్ణంగా గ్రహించగలరు. భక్తుల విన్నపాలను గ్రహించే శూర్పకర్ణుడు శ్రద్ధగా వినడంలో ఉన్న ఉపయోగాన్ని తెలియచేస్తారు.
ఏకదంతుడు:
గమనిస్తే అన్ని విగ్రహాలలో గజాననుడు ఒక్క దంతంతోనే దర్శనమిస్తారు. కొన్ని చోట్ల దంతాన్ని ధరించి కనపడతారు. భగవాన్ శ్రీ వ్యాసమహర్షి అనర్గళంగా చెప్పే మహాభారతాన్ని ఆగకుండా రచించడానికి తగిన ఘంటం తన దంతం అని నిర్ణయించుకున్నారట. సర్వ లోకాలను తగిన సందేశాన్ని అందించే కావ్య రచన చేసి ఏకదంతుడు త్యాగానికి నిర్వచనంగా నిలిచారు. నమ్మి కొలిచినవారికి కొంగు బంగారం. అంతేకాదు పరోపకారం చేయడం మానవ ధర్మం అన్న సందేశాన్ని మనకి తెలియచేస్తారు.
చిన్న నోరు:
మాట అదుపులో ఉంటే జీవితం సంతోషంగా సుఖమయం వివాదరహితంగా సాగుతుంది. ఈ సందేశాన్ని హేరంబుడు తన చిన్న నోటి ద్వారా తెలుపుతున్నారు.
చిన్న కళ్లు:
ఏనుగును గమనిస్తే శరీరానికి ఏమాత్రం సరిపోని కనులు. కానీ ఎంతో సూక్ష్మ దృష్టి కలిగినవి. గజాననుడు తన చిన్ని కళ్ల ద్వారా ప్రతి వస్తువును, విషయాన్నీ సూక్ష్మ దృష్టితో పరిశీలనాత్మకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి అన్న సంకేతం అందిస్తారు.
చతుర్భుజుడు:
వినాయకుడు కొన్ని చోట్ల రెండు చేతులతో, మరికొన్ని చోట్ల నాలుగు చేతులతో దంతం, అంకుశం, అభయ హస్తాలతో దర్శనమిస్తారు. దంతం త్యాగానికి, పాశం రాగానికి (జీవిత ప్రేమానురాగాలు), అంకుశం కోపానికి సంకేతాలు. అహంకారం ప్రబలితే మనలో రాగద్వేషాలు ప్రజ్వరిల్లుతాయి. చతుర్భుజ వినాయకుడు వీటిని తన అదుపులో ఉంచుకొన్నారు.
నాగాభరణుడు:
వినాయకుడు తన పొట్ట చుట్టూ నాగులను ధరించి ఉంటాడు. పాము మంచి-చెడులకు చిహ్నం అని అంటారు. కోరికలకు ప్రతీక అని కూడా అంటారు. అలాంటి కర్మఫలం వలన కలిగే జన్మ జన్మల చక్రం నుండి విముక్తి కలిగించేవాడు లయకారుని కుమారుడు.
లంబోదరుడు:
సృష్టి సూక్ష్మాండ బ్రహ్మాండాలుగా ఉంటుంది అంటారు పెద్దలు. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి భిన్నమైనవి. విశేష రూపుడైన వినాయకుని దేహం ఈ రెండింటికీ ప్రతీక. శిరస్సు బ్రహ్మాండాన్ని సూచిస్తే శరీరం సూక్ష్మాండాన్ని సూచిస్తాయి. పెద్దదైన ఉదరం సమస్త లోకాలు నాలోనే ఇమిడి ఉన్నాయన్నది లంబోదరుని సందేశం. లోక పూజ్యుడైన వినాయక నామస్మరణం ముక్తిదాయకం.
మూషిక వాహనుడు:
భారీ శరీరుడైన గణపతి వాహనం అనుంజుడు అనే మూషికం. ఎలుక అహంకారానికి నిదర్శనం. చొరబడితే ప్రతి ఒక్కదానిని కొరికి నాశనం చేస్తుంది. అహంకారం కూడా మనిషిని పతనం వైపుకి మళ్లిస్తుంది. అలాంటి ఎలుకను తన వాహనంగా చేసుకొన్నారు. భక్తుల అహంకారాన్ని తొలగించి సక్రమ మార్గ నిర్దేశం అందిస్తారు.
ఇక్కడ మరో విషయం గురించి కూడా ప్రస్తావించాలి. గణేశ పురాణంలో గణపతి నాలుగు ముఖ్య అవతారాల ప్రస్థావన కనిపిస్తుంది. ఆ నాలుగు అవతారాలు వేరు వేరు వాహనాలు కలిగి ఉండటం ప్రత్యేకం. మహోటక లేక వక్రతుండ అవతార వాహనం సింహం. మయూరేశ్వర వాహనం నెమలి. ధూమ్రకేతు అవతార వాహనం అశ్వం. విఘ్నరాజ అవతార వాహనం శేషువు. ఇవన్నీ కూడా మనకు గణాధ్యక్షుడు సర్వదేవతా స్వరూపం అన్న పరమ సత్యాన్ని తెలియచేస్తున్నాయి. గణపతి రూపం విశేషాలు తెలుసుకుంటే యాంత్రికంగా గణపతి పూజ చేయడం కాదు.. మనం మన జీవితాలలో నేర్చుకోవలసింది ఏమిటి? అన్న స్పష్టత కలుగుతుంది. అదే మన పెద్దలు మన పర్వదినాలలో అంతర్లీనంగా నిక్షిప్తపరచినది. ఇంతటి విశేష రూప స్వరూపుడైన గజాననుని సేవించడం అంటే మనం మన అహంకార, స్వార్థ, అజ్ఞాన, అసూయ, ద్వేష ప్రవృత్తులను వదిలించుకోవడానికి చేసే ప్రయత్నం అన్న సత్యాన్ని గ్రహించాలి. మన గురించి, లోక హితం గురించి ఆలోచించాలి. సకల ప్రాణికోటికి శుభం కలగాలి అన్న విస్తృత దృక్పథం ఏర్పరచుకోవాలి.
Read also: hindi.vaartha.com
Read also: