అష్టవినాయక క్షేత్రాలు–Ashtavinayak temples
Ashtavinayak temples: మహారాష్ట్రలోని స్వయంభూ క్షేత్రాలైన అష్టవినాయకులను ఒకే ట్రిప్పులో దర్శించాలని అంటారు. దేనికదే ఎంతో విశిష్టమైన వినాయక క్షేత్రాలివి.
మయూర గణపతి (Shree Mayureshwar)
అష్టవినాయకులలో ముందుగా బారమతి తాలూకాలోని మోర్గావ్ గ్రామంలో వెలసిన మయూరేశ్వరుణ్ణి దర్శించాలి. ఇక్కడ వినాయకుడు మూషిక వాహనం మీద కాకుండా మయూరాసనుడై దర్శనమిస్తారు. పూర్వ సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసిస్తుంటే మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు మయూరాసనుడై వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించాడట. అందువల్ల ఇక్కడ స్వామిని మోరేశ్వర్ అంటారు. పాండవులు ఈ వినాయకుణ్ణి పూజించారని, అసలైన ఆ ప్రతిమ ప్రస్తుత విగ్రహానికి వెనుక ఉందని అంటారు. ఈ ఆలయాన్ని బహమనీల కాలంలో నిర్మించారు. అసుర సంహారం గావించిన స్వామి కనుక ఈ క్షేత్రంలో వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలను సైతం వైభవంగా జరుపుతారు.


బల్లాల్లేశ్వరుడు (Ballaleshwar Ganpati Temple)
పాలిలోని బల్లాల్లేశ్వరుడు ఓ భక్తుడి పేరుతో వెలిశాడు. పల్లిపురికి చెందిన కల్యాణ్ సేఠ్ కొడుకైన బల్లాల్, స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి, ఓ రాతి వినాయకుణ్ణి ప్రతిరోజూ పూజించే వాడట. దాంతో రోజూ ఆలస్యంగా ఇంటికి వస్తున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సేల్కి చెప్పగా, కోపం పట్టలేక అతను పిల్లాణ్ణి చెట్టుకి కట్టేసి కొట్టాడట. అపస్మారక స్థితిలోనూ బల్లాల్ గణేశుణ్ణి స్మరించగా, స్వామి ప్రత్యక్షమై కట్లు విడిపించి, ఆ బాలుడి కోరిక మేరకు అక్కడే ఉన్న ఓ పెద్దరాతిలో ఐక్యమయ్యాడనీ, ప్రస్తుతం ఆలయంలోని విగ్రహం అదేనని అంటారు. విగ్రహ రూపం కూడా ఆలయానికి వెనక ఉన్న కొండను పోలి వుండటం విశేషం. ఇక్కడి వినాయకుడికి మోదకాలు కాకుండా బేసన్లడ్డూ ప్రసాదంగా పెడతారు. పూర్వకాలంనాటి చెక్క ఆలయాన్ని తరువాత రాతి ఆలయంగా నిర్మించారు. దీనికి వెనుక దుండి వినాయక ఆలయం ఉంటుంది. బల్లాల్ తండ్రి విసిరికొట్టిన విగ్రహమే ఈ దుండి వినాయకుడు. అందుకే అక్కడ స్వామి పడమట దిశగా ఉంటాడు. భక్తులు ముందుగా దీన్ని దర్శించాకే బల్లాల్ విగ్రహాన్ని పూజిస్తారు.


చింతామణి గణపతి (chintamani ganpati)
పూణెకి ఇరవై కిలోమీటర్ల దూరంలో థేవూర్ అనే గ్రామంలో ఉందీ ఆలయం. పూర్వం కపిల మహాముని దగ్గర భక్తుల కోరికను నెరవేర్చే చింతామణి ఉండేదట. ఓసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కొడుకు గుణ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ మణి ప్రాశస్త్యాన్ని గుర్తించి, దాన్ని అపహరిస్తాడు. అప్పుడు ఆ ముని గణపతి సహాయంతో యుద్ధం చేసి తిరిగి మణిని పొంది, కదంబం చెట్టు కింద ఉన్న వినాయకుడి మెడను అలంకరింపజేసాడట. అప్పటి నుంచి ఆ ఊరు కదంబ నగర్, స్వామి చింతమణి వినాయకుడిగా పేరు గాంచాడు. పేష్వాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.


విఘ్నహరుడు (Vighnahar Ganpati)
కుకడి నదీ తీరంలో ఓఝార్ పట్టణంలో కొలువయ్యాడు విఘ్నహరుడు. ఆలయ శిఖరం బంగారు పూతతో మెరుస్తుంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసించేవాడట. అప్పుడు వాళ్లు ఏకదంతుణ్ణి వేడుకోగా వినాయకుడు రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. వినాయకుడితో గెలవలేని ఆ అసురుడు, శరణు కోరి తన పేరు మీద స్వామిని అక్కడే కొలువుండాలని కోరతాడు. అందుకే ఇక్కడి గణేశుణ్ణి శ్రీ విఘ్నేశ్వర్, విఘ్నహార్ వినాయక్ అని పలుస్తారు. అప్పట్లో మునులు స్వామికి కట్టించిన ఆలయాన్ని తరువాతి కాలంలో పునర్నిర్మించాడట.




సిద్ధివినాయకుడు (Siddhivinayak)
గణేశుడు ఈ క్షేత్రంలో కుడివైపు తొండంతో దర్శనమిస్తాడు. ఈ లంబోదరుణ్ణి విష్ణుమూర్తే స్వయంగా ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడని స్థల పురాణం. పూర్వం శ్రీమహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులను అంతమొందించేందుకు వినాయకుడి సాయాన్ని తీసుకున్నారట, అందుకు ప్రతిగా సృష్టించిందే ఈ ఆలయం. అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణ సమీపంలోని చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని తరువాత పేష్వాలు నిర్మించారు. ఇక్కడ వినాయకుడికి ఒక్క ప్రదక్షిణ చేయాలంటే కొండ చుట్టూ తిరగాలి. సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది. కార్యసిద్ధి వినాయకుడిగా భావించి, భక్తులు ప్రదక్షిణలు చేసి తమ మొక్కును తీర్చుకుంటారు.


వరద వినాయకుడు (Shri Varad Vinayak)
పుణెకి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలోని మహద్ క్షేత్రంలో వెలిసిన స్వామి వరద వినాయకుడు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రుక్మాంగదుడనే మహారాజు ఓసారి ఈ గ్రామంలోని వాచక్నవి రుషి దర్శనార్థం వచ్చాడట. రుషిపత్ని ముకుంద రాజుని చూసి మనసు పడుతుంది. రాజు తిరస్కరించి వెళ్లిపోతాడు. అప్పుడు ఇంద్రుడు రాజు రూపంలో వచ్చాడట. ఆ కలయిక వల్ల గృత్సమధుడు పుడతాడు. పెరిగి పెద్దయ్యాక తన జన్మ రహస్యాన్ని తెలుసుకుని, అందరి పాపాలు తొలగిపోయేందుకు గణపతిని ప్రార్థించాడట. ఆ భక్తికి మెచ్చి అక్కడే స్వయంభువుగా వెలసి వరద వినాయకుడుగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఆలయంలోని దీపం అఖండంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులు స్వయంగా స్వామికి తమ కానుకలు సమర్పించుకునే వెసులుబాటు ఉండటం ఆ ఆలయం ప్రత్యేకత.


గిరిజాత్మజ్ వినాయక్ (Girijatmaj Ganpati)
లేహ్యాద్రి పర్వతం మీద బౌద్ధ గుహల సముదాయంలో కొలువు దీరాడు ఈ గిరిజాత్మజుడు. పుణెకి తొంభై కిలోమీటర్ల దూరంలోని వున్న ఈ ఆలయం సందర్శించాలంటే సుమారు మూడు వందల మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా ఏక రాతికొండనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. పుత్రుడి కోసం దాదాపు పన్నెండేళ్లు తపస్సు చేసి, తరువాత నలుగుపిండితో చేసిన బాల గణపతికి ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. కౌమార ప్రాయం వచ్చే వరకు తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని పౌరాణిక ప్రాశస్త్యం. విదుద్దీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకాంతి గుడిలోపల పడేలా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.


మహాగణపతి (Mahaganpati Ganpati)
తన వరసిద్ధి ప్రభావంతో లోకకంట కుడుగా మారిన త్రిపురాసురుణ్ణి అంతమొందించేందుకు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ని తలచుకుని యుద్ధం చేసి, ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు పరమశివుడు. ప్రతిగా ఆ హరుడే స్వయంగా ఇక్కడ మహాగణపతిని ప్రతిష్ఠించాడని గణేశ పురాణం వల్ల తెలుస్తోంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా విగ్రహం మీద పడేలా నిర్మించిన ఈ ఆలయాన్ని తిరిగి 18వ శతాబ్దంలో పేష్వాలు పునర్నిర్మించారు. ఒకప్పుడు మణిపుర్గా పిలిచే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రంజన్ గావ్ పిలుస్తున్నారు.

