AP Police : ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో క్రికెట్ బెట్టింగ్స్ జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు విశాఖ లోనూ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రత్యక్షంగా కొన్ని చోట్ల బెట్టింగ్స్ జరుగుతుంటే ఆన్‌లైన్ ద్వారా కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో డబ్బులు పోగొట్టుకుని బాధితులు రోడ్డు పాలవుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ కట్టిన కొందరు నష్టాలు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కలకలం రేపాయి. దీంతో బెట్టింగ్స్ నిర్వహణపై రెండు రాష్ట్రాల పోలీసు శాఖలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాయి.

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
అయితే ఐపీఎల్ బెట్టింగులను కట్టడి చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారింది. ఈ మేరకు నిఘాను పెంచింది. బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులకు దిగుతున్నారు. నిందితులతో పాటు నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిందతులను జైలుకు పంపుతుననారు. మరోవైపు బెట్టింగ్ నిర్వాహకులపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. రంగంలోకి డైరెక్ట్‌గా ఏపీ డీజీపీ మహేశ్ కుమార్ గుప్తా దిగారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగుల్లో పాల్గొని యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నిర్వాహకుల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని డీజీపీ గుప్తా హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.