దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా విధించిన టారిఫ్ డెడ్‌లైన్ జులై 9 సమీపిస్తున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి సూచీలపై (Stock market) కనిపించింది. దీంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోగా.. నిఫ్టీ 25,500 దిగువకు చేరింది.
టారిఫ్ డెడ్‌లైన్ ప్రభావం
సెన్సెక్స్ (Sensex) ఉదయం 83,790.72 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,697.29) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 83,935.01 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టంతో 83,409.69 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం 88.40 పాయింట్ల నష్టంతో 25,453.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.68గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటి జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 67.70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3352 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also: US: రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్‌కు అమెరికా ఆంక్షలు