CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆదాయార్జన శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీ సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పన్ను ఎగవేతలకు ఏఐ(AI)తో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు.

కొత్త పాలసీతో 33% పెరిగిన ఎక్సైజ్ శాఖ ఆదాయం
రాష్ట్ర ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్ల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త పాలసీతో 33% పెరిగిన ఎక్సైజ్ శాఖ ఆదాయం, మున్సిపల్ శాఖలో ఇంకా రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది.
ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వాడాలి
అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు.