కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు, రాష్ట్రానికి నిధుల విడుదల వంటి అంశాలపై ఆయన చేసిన ఆరోపణలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
కేంద్ర మంత్రి ఆరోపణలు:
ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో మాట్లాడుతూ, తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే ప్రభుత్వం నాశనం చేస్తోంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని (NEP 2020) వ్యతిరేకిస్తూ విద్యార్థులను కేంద్ర విద్యా విధానానికి దూరం చేస్తోంది అని ఆయన ఆరోపించారు. NEP అమలు చేయకపోవడం వల్ల తమిళనాడు విద్యార్థులు అనేక అవకాశాలు కోల్పోతారని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.
స్టాలిన్ కౌంటర్:
తమిళనాడు ప్రభుత్వం NEP 2020ని అమలు చేయబోదని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎవరూ మాపై ఒత్తిడి చేయలేరు. విద్యా వ్యవస్థపై మేం స్వయం ప్రతిపత్తిని కోల్పోదు అని స్టాలిన్ అన్నారు. కేంద్రం మాపై ఒత్తిడి చేసే హక్కు లేదు. నిధులు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలన చూస్తున్నారు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి తన నోటికి అదుపు పెట్టుకోవాలి. తమిళనాడును అవమానించేలా మాట్లాడటం తగదు అని హెచ్చరించారు .కేంద్రం విద్యా రంగంలో తాము కోరుకున్న విధానాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడుకు రావాల్సిన నిధులను కేంద్రం రాజకీయ కారణాల రీత్యా అడ్డుకుంటోంది. NEP 2020 అనేది విద్యార్థులకు అసమ్మతిని కలిగించే విధానం అని దాన్ని ఆమోదించలేమని స్టాలిన్ అన్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని నిలదీశారు. ఈ మాటల యుద్ధం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డీఎంకే వర్సెస్ కేంద్రం వాదన కొనసాగుతుండగా, రాష్ట్ర విద్యా విధానంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలనుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిధులు ఇవ్వకుండా తమిళ ప్రజల్ని మోసం చేస్తున్నారని, తమిళ ఎంపీలను అనాగరికులు అంటారా అని తన సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ ఎదురుదాడి చేశారు.