చెన్నై: కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీఎం స్టాలిన్ తాజాగా స్పందించారు. మూడు భాషల ఫార్ములాను తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.

మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..?
తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ మమ్మిల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతున్నారో మాత్రం చెప్పరెందుకు..?. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..? అని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ నిలదీశారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది
మరోవైపు, స్టాలిన్ కుమారుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తాము మాత్రం ఎప్పటికీ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఆయన తేల్చిచెప్పారు.