సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాపై కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందన్నారు. మహేశ్ బాబు ఇమేజ్, గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని కథ కాంటెంపరరీలో ఉందా అనే జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మూవీకి కథ విషయంలో చాలా కసరత్తులు చేసినట్లు పేర్కొన్నారు. అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తామన్నారు.

ఈ చిత్రం మహేశ్ బాబు కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. సాహసోపేతమైన కథతో రూపొందనున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్, భారీ సెట్స్ ఉపయోగించనున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా, సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ప్రియాంక, ఈ సినిమాతో మరోసారి తెలుగులోకి అడుగుపెడుతుంది.