తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ (ధనశుద్ధి) ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేరుగా రంగప్రవేశం చేసింది. తాజాగా ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, సాక్ష్యాలు, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను సమర్పించాలని కోరారు.ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ (శిశు అక్రమ రవాణా) ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిందని ఈడీ అనుమానిస్తోంది. ఫెర్టిలిటీ సెంటర్ (Fertility Center) పేరుతో నిబంధనలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిపినట్లు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా, బిడ్డల అక్రమ దత్తత, పత్రాల తారుమార్లు, తల్లిదండ్రులకు తప్పుదారి పట్టించే వాగ్దానాలు చేసినట్లు సమాచారం.
ఎనిమిది రాష్ట్రాల్లో కార్యకలాపాలు
ప్రాథమిక దర్యాప్తులో, డాక్టర్ నమ్రత కార్యకలాపాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా ఈ అక్రమ వ్యవహారాలు సాగించినట్లు అనుమానిస్తున్నారు. ఈడీ ఇప్పటికే ఆ రాష్ట్రాల పోలీసు శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 30 మందిని అరెస్టు చేసి విచారించగా.. పలు కీలక విషయాలు బయటపడ్డాయి.నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వారి పిల్లలను కొనుగోలు చేస్తున్న ముగ్గురు దళారులను విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ దళారులకు డాక్టర్ నమ్రత (Dr. Namrata) కు మధ్య సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దళారుల ద్వారానే ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రధాన నిందితురాలు
ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో గర్భం రాని మహిళలకు పిల్లలను అమ్మి సరోగసి, ఐవీఎఫ్ ద్వారా వారికి జన్మనిచ్చినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు బయటపడింది.ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత భర్త సురేశ్, ఆమె చెల్లి కీర్తి, పలువురు ఉద్యోగులు ఈ దందాలో భాగమయ్యారు. పిల్లల కొనుగోలుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి.. వారిని సంతానం లేని వారికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు మరింత కీలక మలుపు
ఈ డబ్బును వివిధ మార్గాల ద్వారా మనీలాండరింగ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఈడీ దృష్టి పెట్టింది. మెుత్తంగా హవాల రూపంలో పిల్లల్ని విక్రయించి రూ.40 కోట్ల వరకు సంపాదించనట్లు పోలీసులు గుర్తించారు. మెుత్తం 86 మంది పిల్లల్ని ఛైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేలింది.ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈడీ ఎంట్రీతో కేసు మరింత కీలక మలుపు తీసుకుంది. డాక్టర్ నమ్రత ఆర్థిక లావాదేవీలు, ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఈడీ దృష్టి సారించింది. పోలీసుల దర్యాప్తు, ఈడీ విచారణ పూర్తి కాగానే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫెర్టిలిటీ సెంటర్ అంటే ఏమిటి?
ఫెర్టిలిటీ సెంటర్ అనేది గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులకు చికిత్సలు, సలహాలు, ఆధునిక వైద్య సాంకేతికతలతో సహాయం అందించే ప్రత్యేక వైద్య కేంద్రం.
ఫెర్టిలిటీ సెంటర్‌లో ఎలాంటి చికిత్సలు అందిస్తారు?
ఐవీఎఫ్ (IVF – In Vitro Fertilization),ఐయూఐ (IUI – Intrauterine Insemination),ఐసీఎస్ఐ (ICSI – Intracytoplasmic Sperm Injection),గుడ్డు/వీర్యం డోనేషన్,ఎంబ్రియో ఫ్రీజింగ్,హార్మోనల్ చికిత్సలు.
Read hindi news: hindi.vaartha.com
Read also: