తెలంగాణ ప్రభుత్వం దావోస్ సదస్సులో పాల్గొన్నదుకు అనూహ్యమైన విజయాలు సాధించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈసారి నాలుగు రెట్లు ఎక్కువ ఒప్పందాలు కుదిరాయని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరిగిందని, ఇది తెలంగాణ అభివృద్ధికి కీలకమైన అడుగు అని మీడియా సమావేశంలో వెల్లడించారు. దావోస్ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడుల ఫలితంగా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 49,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులు తెలంగాణను అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా చూస్తున్నారని, ఇది గ్లోబల్ స్థాయిలో రాష్ట్ర కీర్తిని పెంచిందని వివరించారు.
![sridar](https://vaartha.com/wp-content/uploads/2024/11/sridar-1024x576.jpg.webp)
వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడంలో దావోస్ పర్యటన గొప్ప అడుగుగా నిలిచిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందని, దీని వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన విజయాన్ని ప్రకటించడం సరికాదని, కంపెనీలు పూర్తిస్థాయిలో స్థాపన కావడం, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం విజయం సాధించడానికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ప్రభుత్వ విశ్వాసం, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలను సద్వినియోగం చేసుకుంటామని, ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన వివరించారు.