Sri Dhar Babu : జీవ వైవిధ్యాన్ని కాపాడతామన్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) చెందిన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోదని స్పష్టం చేశారు.ఈ వివాదానికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తులు తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశ్వవిద్యాలయ భూమి పూర్తిగా దానికే చెందుతుందని దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుగా ఈ భూ వివాదం నిలిస్తే, దాన్ని ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. ఈ వివాదంపై కొన్ని రోజుల క్రితం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్‌తో చర్చలు జరిగాయని తెలిపారు.

గతంలో పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గచ్చిబౌలి ప్రాంతంలోని రాక్ ఫార్మేషన్స్, మష్రూమ్ రాక్స్, పికాక్ లేక్ వంటి ప్రకృతి రమణీయతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశ్వవిద్యాలయ పరిసరాల్లోని జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ వివాదంపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. భూమి వ్యవహారం రాజకీయ దురుద్దేశాలతో ప్రాచుర్యం పొందుతున్నా, వాస్తవాలు తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు.