హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో టిక్కెట్ బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్‌కు ముందు బ్లాక్ టిక్కెట్ల విక్రయంపై పోలీసులు కఠినంగా స్పందించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) పోలీసులు ఆదివారం ఉదయం ఓ పక్కా సమాచారం మేరకు ఉప్పల్ స్టేడియం వద్ద దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం (మార్చి 23) ఉప్పల్ స్టేడియంలో SRH వర్సెస్ RR మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియంకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే, ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది బ్లాక్ టిక్కెట్ల విక్రయదారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు హస్తక్షేపం చేసి టిక్కెట్లను నల్లదందా చేస్తున్న నలుగురిని పట్టుకున్నారు.
15 టిక్కెట్లు స్వాధీనం మరింత దర్యాప్తులో పోలీసులు
ఈ దాడుల్లో పోలీసులకు నిందితుల వద్ద నుండి 15 టిక్కెట్లు లభించాయి. వీటిని వారు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. టిక్కెట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ప్రతి ఏడాది హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బ్లాక్ టిక్కెట్ల దందా పెరిగిపోతూ వస్తోంది. ఈ ఏడాది టిక్కెట్లపై భారీ డిమాండ్ ఉండటంతో కొంతమంది దళారులు టిక్కెట్లను అధిక ధరకే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా ఉంచి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులపై దర్యాప్తు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని మరిన్ని దాడులు చేపట్టే అవకాశముందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా మరికొందరు వ్యక్తులు ఉండవచ్చని అనుమానంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.