Spy Cameras : స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో మహిళా వసతి గృహాల్లో బాత్రూంలు గదుల్లో స్పై కెమెరాలు బయటపడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పై కెమెరాల విక్రయాలపై నియంత్రణ విధించాలని న్యాయవాది శ్రీరమ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.స్పై కెమెరాల నియంత్రణపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని నేడు తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆన్‌లైన్ మార్కెట్‌లలో ఈ కెమెరాలు ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముడవుతున్నాయని దుర్వినియోగానికి గురవుతున్నాయని శ్రీరమ్య కోర్టుకు తెలిపారు. మహిళల గోప్యతకు భంగం కలిగించే ఈ ఘటనలను నిరోధించేందుకు ప్రభుత్వ జోక్యం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది ముఖర్జీ స్పై కెమెరాల దుర్వినియోగంపై ఇప్పటికే చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. అయితే న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతి మొబైల్‌లోనూ కెమెరాలు ఉన్న వేళ, స్పై కెమెరాలను ప్రత్యేకంగా ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు.దీనిపై శ్రీరమ్య సమాధానమిస్తూ, మొబైల్ కెమెరాలను గుర్తించగలిగినప్పటికీ, స్పై కెమెరాలను రహస్యంగా అమర్చడం వల్ల బాధితులు ముందుగా తెలుసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. అందుకే వీటి విక్రయాలపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరారు.అయితే హైకోర్టు ఈ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఆదేశించే అవకాశంలేదని స్పష్టం చేసింది. దీనితో, ఈ అంశంపై మరిన్ని చర్చలు అవసరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.