రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఈ అవకాశం దక్కించుకోవడం అతని కెరీర్‌లో ముఖ్యమైన మలుపు అని చెప్పాలి.తనుష్ పేరు తెలవడానికి ముందు అతని ఘనతలు తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు గూగుల్‌ను షికార్లు చేస్తున్నారని చెప్పవచ్చు.కర్ణాటకలో పుట్టిన అతను చిన్న వయసులోనే ముంబైకి మకాం మార్చాడు.అక్కడే తన క్రికెట్ ప్రతిభను నింపుకున్న తనుష్, ముంబై జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.2018లో 20 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన అతను అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు.తనుష్ కోటియన్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై జట్టులో శాశ్వత స్థానం సంపాదించాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడిన తనుష్,41.21 సగటుతో 1525 పరుగులు చేశాడు.అంతేకాకుండా,101 వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యాన్ని కూడా చాటాడు.
అతని బ్యాటింగ్‌లో 2 శతకాలు, 13 అర్ధశతకాలు ఉన్నాయి.లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి ఇలా రాణించడం అతని ప్రత్యేకతగా నిలిచింది.తాజాగా విజయ్ హజారే ట్రోఫీతో పాటు,ముంబై రంజీ జట్టు విజయాల్లో తనుష్ కీలక పాత్ర పోషించాడు.2023-24 సీజన్‌లో ముంబై జట్టు రంజీ ట్రోఫీ గెలుచుకోవడంలో అతని పాత్ర మరువలేనిది.41.83 సగటుతో 502 పరుగులు చేయడం మాత్రమే కాకుండా, 29 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఇరానీ కప్‌లో తన సెంచరీతో ముంబై జట్టుకు 27 ఏళ్ల తర్వాత టైటిల్ అందించాడు.దులీప్ ట్రోఫీలో భారత్ ఎ జట్టు తరపున ఆడుతూ 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రదర్శనలన్నింటి పర్యవసానంగా అతనికి ఇప్పుడు భారత జట్టులో స్థానం లభించింది.టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగేందుకు తనుష్ కోటియన్ సిద్ధంగా ఉన్నాడు.మెల్‌బోర్న్,సిడ్నీ వేదికలపై జరగబోయే చివరి రెండు టెస్టుల కోసం అతను ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనం.జట్టుకు కొత్త రక్తాన్ని అందించగల ఆటగాడిగా తనుష్‌పై పెద్ద ఆశలు ఉన్నాయి.26 ఏళ్ల ఈ యువ స్పిన్నర్‌పై ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది.