భారత క్రికెట్‌కు సేవలందించిన మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగరాజ్ సింగ్, టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ గొప్ప ఆటగాళ్లే అయినా, మరింతగా నిలకడగా రాణించాలంటే తీవ్రమైన శ్రమ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉదయం 5 గంటల శిక్షణే విజయానికి మార్గం
ఓ క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ మాట్లాడుతూ, “రోహిత్, కోహ్లీ గిన్నిస్ స్థాయి ప్రతిభ కలిగినవాళ్లు. కానీ వారిని ఉదయం 5 గంటలకు లేపి శిక్షణ ఇప్పించేదెవరు? ’10 కిలోమీటర్లు పరుగెత్తాలి’ అని ఎవరైనా వారిని మోటివేట్ చేస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు. ఆటలో అగ్రస్థాయికి చేరాలంటే కఠినమైన శ్రమ తప్పనిసరని ఆయన హితవు పలికారు.

ఆత్మతృప్తి ప్రమాదకరం: యోగరాజ్ విమర్శలు
ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తమను తాము ‘దేవుళ్లలా’ భావిస్తున్నారని యోగరాజ్ ఆరోపించారు. “ఇప్పుడు వాళ్లు తమ ఆట గురించి తక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా తామే గొప్పవాళ్లమని అనుకుంటున్నారు. దాంతో మ్యాచ్‌ల్లో స్థిరత లేకపోతోంది. ఐదింటికి మేలుకుని సాధన చేయకపోతే, ఆటలో ముందుకు ఎలా పోతారు?” అని ఆయన విమర్శించారు.
బ్రాడ్‌మన్ సగటుతో పోలిక
డాన్ బ్రాడ్‌మన్ 99.94 సగటుతో ఆట ఆడితే, కోహ్లీ, రోహిత్‌లు 54-55 వద్దే ఎందుకు ఆగిపోయారు? అని ప్రశ్నించారు యోగరాజ్. ఇది వారి స్థిరతలో లోపాన్ని సూచిస్తుందన్నారు. “పది మ్యాచ్‌ల్లో ఐదింటా ఫెయిల్ అవుతున్నారు అంటే, ఆటపై దృష్టి లేదన్న మాట. ఇది మారాలి,” అని హెచ్చరించారు.
సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా చూపిన యోగరాజ్
వినయశీలత అంటే ఏమిటో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)నుండి నేర్చుకోవాలని సూచించిన యోగరాజ్, “సచిన్ ఎందుకు 43 ఏళ్లు వరకు ఆడగలిగాడు? ఎందుకంటే అతను ఎప్పుడూ నేలమీదే ఉండేవాడు. అవసరమైతే రంజీ మ్యాచ్‌లు కూడా ఆడేవాడు. అలా ఉండడంవల్లే అతని స్థిరత వచ్చిందని,” అన్నారు.
ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు మరియు టీ20ల నుండి తప్పుకున్న నేపథ్యంలో, వన్డే ఫార్మాట్‌లో వారి భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. ఈ సందర్భంలో యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
read hindi news:hindi.vaartha.com
read also: