సన్‌రైజర్స్ కీలక నిర్ణయం: హర్ష్ దూబే జట్టులోకి – ప్లే ఆఫ్స్ లక్ష్యం!
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆశపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యువ బౌలర్ స్మరణ్ రవిచంద్రన్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వడంతో, అతడి స్థానంలో మహారాష్ట్రకి చెందిన యువ మరియు ప్రతిభావంతుడు హర్ష్ దూబేను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు సోమవారం సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది.
“స్మరణ్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అతడి స్థానాన్ని హర్ష్ దూబే భర్తీ చేయనున్నాడు. ప్లే విత్ ఫైర్,” అంటూ సన్‌రైజర్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. హర్ష్ దూబేకు రూ. 30 లక్షల కాంట్రాక్ట్‌తో ఆరెంజ్ ఆర్మీలో చోటు దక్కింది.
రంజీ ట్రాక్ రికార్డ్‌తో ఆకట్టుకున్న హర్ష్ దూబే
22 ఏళ్ల హర్ష్ దూబే 2024–25 రంజీ ట్రోఫీలో విదర్భ తరఫున అదిరే ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడు 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు తీసి సింగిల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి బౌలింగ్ ఎకనామీ 2.66గా ఉండడం విశేషం. ఈ ప్రదర్శనతో అతడు దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అందులో ఏడు సార్లు 5 వికెట్లు, రెండు సార్లు 10 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
విదర్భ జట్టు ఫైనల్లో కేరళపై గెలిచి మూడోసారి రంజీ టైటిల్ సాధించడంలో హర్ష్ కీలక పాత్ర పోషించాడు. ఈ బౌలింగ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని, SRH అతడిని తమ టీమ్‌కు ఎంపిక చేసింది. SRH అభిమానులు హర్ష్ రాకతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలపడుతుందని ఆశిస్తున్నారు.
స్మరణ్ – జంపా రీప్లేస్ నుంచి గాయ బాధితుడిగా
ఇంతకుముందు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగగా, అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి స్మరణ్‌ను ఎంపిక చేశారు. అయితే, స్మరణ్ మ్యాచ్ ఆడకముందే ప్రాక్టీస్ సమయంలో గాయపడినట్టు సమాచారం. దాంతో అతడికి టోర్నీ నుంచి దూరమయ్యే పరిస్థితి ఎదురైంది.
ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ తక్షణమే చర్యలు తీసుకుని హర్ష్ దూబేను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. సీజన్ మధ్యలో వచ్చిన ఈ మార్పుతో జట్టులో కొన్ని మార్పులు తప్పక ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హర్ష్ ఆల్‌రౌండ్ టాలెంట్ – బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దూకుడు
కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, హర్ష్ దూబే బ్యాటింగ్‌లోనూ చక్కటి ప్రతిభను చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు తన ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ A కెరీర్‌లో 941 పరుగులు చేసి, ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. దీంతో మిడిల ఆర్డర్‌లో అవసరమైన సమయంలో బ్యాటింగ్ సహకారాన్ని అందించగలడు.
ఇలాంటి ఆల్‌రౌండ్ టాలెంట్ ఉన్న బౌలర్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా SRH తన ఆటతీరు మరింత మెరుగుపరచనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ SRHకి కీలకం కానుంది. అలాంటి సమయానికి హర్ష్ లాంటి ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను తీసుకోవడం జట్టుకు మేలు చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
read also: Pak: పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు లభించని ప్రేక్షక ఆదరణ