భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఉపాధ్యాయ దినోత్సవం (Teacher’s Day)సందర్భంగా తన జీవితాన్ని మలిచిన ముగ్గురు గురువులను అత్యంత భావోద్వేగంతో స్మరించాడు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్, కోచ్ రమాకాంత్ అచ్రేకర్, సోదరుడు అజిత్ టెండూల్కర్ తాను జీవితంలో ఎదురైన నిజమైన మార్గదర్శకులని చెప్పాడు.
ప్రత్యేక పోస్ట్ ద్వారా గురువులకు గౌరవం
సచిన్, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ముగ్గురితో ఉన్న కొన్ని అరుదైన ఫోటోలు పంచుకుంటూ, వారి మార్గదర్శకత్వం తన జీవితంలో ఎలా ప్రభావం చూపిందో వివరించాడు. “ఒక కాయిన్, ఒక కిట్ బ్యాగ్.. ఇంకా ముగ్గురు గురువులతో నా ప్రయాణం మొదలైంది,” అంటూ తన జర్నీని గుర్తుచేసుకున్నాడు.
తండ్రి రమేశ్ టెండూల్కర్ – ప్రేమతో పెంచిన గురువు
సచిన్, తన తండ్రి రమేశ్ టెండూల్కర్ (Ramesh Tendulkar) గురించి మాట్లాడుతూ, ఆయన కేవలం ప్రముఖ మరాఠీ కవి మాత్రమే కాకుండా, ఒక మంచి తండ్రి, జీవన మార్గదర్శకుడని తెలిపాడు.
“నాన్న ఎప్పుడూ నన్ను ఒత్తిడిలో పెట్టలేదు. నా కలల్ని నెరవేర్చేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తుంచుకుంటాను,” అని సచిన్ పేర్కొన్నాడు.
రమాకాంత్ అచ్రేకర్ – క్రికెట్ గురువు
తన చిన్ననాటి కోచ్ అచ్రేకర్ సార్ గురించి మాట్లాడుతూ, “కఠినమైన శిక్షణే నన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చింది” అని పేర్కొన్నాడు. సచిన్‌తో పాటు, వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగార్కర్, సంజయ్ బంగర్ లాంటి ఎన్నో టాలెంట్‌లను తీర్చిదిద్దిన అచ్రేకర్ 2019లో కన్నుమూశారు. ద్రోణాచార్య అవార్డు పొందిన ఆయన గురించి సచిన్ ప్రత్యేకంగా స్మరించాడు.
సోదరుడు అజిత్ టెండూల్కర్ – మొదటి స్ఫూర్తిదాయకుడు
తన సోదరుడు అజిత్ పాత్ర గురించి సచిన్ ఎంతో గౌరవంతో మాట్లాడాడు. “నాలో క్రికెట్ మీద ఆసక్తిని మొదట గుర్తించినవాడు అజిత్. ప్రతి అడుగులోనూ వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించాడు,” అని సచిన్ తెలిపాడు. అజిత్ లేకపోతే తాను క్రికెట్‌లో ప్రవేశించేవాడినే కాదని ఆయన పేర్కొన్నాడు.
అభిమానుల నుంచి ప్రశంసల వర్షం
ఈ హృద్యమైన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. సచిన్ తన గురువుల పట్ల చూపిన గౌరవం, వినయం చూసి అభిమానులు మన్ననలు కురిపిస్తున్నారు. “సచిన్ కేవలం గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: