
మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం..
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi)ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కోసం వేలాది మంది అభిమానులు భారీగా ఖర్చు చేసి కోల్‌కతాకు చేరుకున్నారు. అయితే, వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం చివరకు తీవ్ర అసంతృప్తి, ఉద్రిక్తతకు దారి తీసింది. మెస్సీ మైదానంలో కేవలం కొన్ని నిమిషాలపాటు మాత్రమే కనిపించి వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్
టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు
రూ.5,000 నుంచి రూ.12,000 వరకు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు గంటల తరబడి ఎదురు చూశారు. కానీ తమ అభిమాన ఆటగాడు కాసేపటికే స్టేడియం విడిచిపెట్టడంతో నిరాశకు గురయ్యారు. ఆగ్రహంతో కొందరు అభిమానులు స్టాండ్స్‌లో నిరసనకు దిగగా, కొంతమంది బాటిళ్లు విసిరారు, హోర్డింగులను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని జనాన్ని అదుపులోకి తీసుకువచ్చారు.
మెస్సీ కోసం వేల ఖర్చు.. చివరికి నిరాశే మిగిలింది
ఈ ఘటనపై పలువురు అభిమానులు నిర్వాహకులపై మండిపడ్డారు. మెస్సీ చుట్టూ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులే ఉండటంతో సామాన్య అభిమానులకు అవకాశం లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు చేసి వచ్చినప్పటికీ తమ అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అభిమానులను మోసం చేయడమేనని పలువురు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాకు వచ్చిన మెస్సీకి నగరంలో ఘన స్వాగతం లభించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్‌తో కలిసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అయితే స్టేడియంలో ఏర్పడిన గందరగోళం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee), క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీతో జరగాల్సిన సమావేశాలను మెస్సీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని, తన పర్యటనలో తదుపరి నగరమైన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :