భారత క్రికెట్ ప్రపంచంలో వివాదాలు కొత్త విషయం కాదు. ఇటీవల మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ (Yograj Singh) చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. యోగరాజ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడు యువరాజ్ సింగ్ టీమిండియాలో నిజమైన స్నేహితులేని వ్యక్తి అని, అతని పక్కన నిలిచిన ఒక్కరు సచిన్ టెండూల్కర్ మాత్రమే అని వెల్లడించారు.
యోగరాజ్ సింగ్ వ్యాఖ్యల ప్రకారం, యువరాజ్ సింగ్ ప్రతి సారి ఫీల్డ్లో, మ్యాచ్‌లలో ప్రదర్శించిన అద్భుత ప్రతిభకు బదులుగా జట్టులో కొంతమంది ఆటగాళ్లు అన్యాయమైన ప్రవర్తన చూపించేవారని ఆయన పేర్కొన్నారు. సచిన్ మాత్రమే యువరాజ్‌కు సానుకూల మద్దతు ఇచ్చినట్లు, మిగిలిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, ఇతర సీనియర్ సభ్యులు కొన్ని సందర్భాలలో యువరాజ్ (Yuvraj Singh) పై వ్యతిరేక భావాలను వ్యక్తం చేశారని తెలిపారు.

మిగతా వారందరూ యువరాజ్ సింగ్‌కు వెన్నుపోటు పొడిచేవారేనని
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ కేవలం సహచరులు మాత్రమేనని.. స్నేహితులు కాదని చెప్పారు. యువరాజ్ సింగ్‌కు నిజమైన స్నేహితుడని.. అతని వెన్నంటి నిలిచిన ఏకైక వ్యక్తి ఒక్క సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మాత్రమేనని చెప్పుకొచ్చారు. మిగతా వారందరూ యువరాజ్ సింగ్‌కు వెన్నుపోటు పొడిచేవారేనని ఆరోపించారు. అంతే కాకుండా అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనితో సహా జట్టులో అందరూ యువరాజ్ సింగ్‌కు భయపడేవారని ఆయన వ్యాఖ్యానించారు.గతంలో కూడా యోగరాజ్ సింగ్ పలు సందర్భాల్లో ఎంఎస్ ధోనిపై తీవ్ర విమర్శలు చేశారు.
యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించడంలో ధోని కీలక పాత్ర పోషించారని గతంలో చాలా సార్లు ఆరోపించారు. అయితే ఈ సారి యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలు కేవలం ధోనీకే పరిమితం కాకుండా.. ప్రస్తుత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కూడా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. యోగరాజ్ సింగ్ చేసిన ఈ ప్రకటనపై బీసీసీఐ లేదు మరే ఇతర ఆటగాడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే నెట్టింట యువరాజ్,కోహ్లీ, ధోనీ అభిమానుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: