Ball Tampering: ఐపీఎల్‌లో చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబయి ఫ్యాన్స్ ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఘనంగా ఆరంభించింది.ఆదివారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.అయితే ఈ గెలుపు అనంతరం చెన్నైపై కొన్ని సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎస్‌కే జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ముంబై ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి బంతిని మారుస్తున్నట్టు అనుమానాస్పద వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ముంబై అభిమానులు పెద్ద ఎత్తున దీని గురించి చర్చిస్తున్నారు.నెటిజన్లు పంచుకుంటున్న వీడియోలో, ఖలీల్ బౌలింగ్ చేసేటప్పుడు అతడి చేతిలో ఒక చిన్న వస్తువు కనిపించిందని, అది బంతిని మార్చడానికి ఉపయోగించారని అంటున్నారు.

అనంతరం ఆ వస్తువును రుతురాజ్ గైక్వాడ్‌కు అందజేశాడని, అతడు అది జేబులో పెట్టుకున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఐపీఎల్ నిర్వహణ బృందం విచారణ చేపట్టాలని, తప్పు చేస్తే చెన్నైపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.ముఖ్యంగా, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేయడం, ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్‌ను పూర్తిగా చెన్నై వశం చేసేసింది.
చివర్లో ట్రెంట్ బౌల్ట్‌ను కూడా ఔట్ చేసి తన దూకుడు కొనసాగించాడు.ఈ ఆరోపణలపై చెన్నై ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, వీడియోలో ఖలీల్ ఏం ఇచ్చాడో స్పష్టంగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇది కేవలం ‘చూయింగ్ గమ్’ కావొచ్చని, టీవీ అంపైర్లు ప్రతీ చిన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారని, అంపైర్ల వద్ద నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఐపీఎల్ నిర్వహకులు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ, ఈ వివాదం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. చెన్నైపై నిజంగా చర్యలు తీసుకుంటారా? లేక ఇది కేవలం పుకారు అని తేలుతుందా? అనేది చూడాల్సి ఉంది.