రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ
సియోల్ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెల్ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంపై విచారణ జరుగుతోంది. అయితే, ఆయన అభిశంసనపై కోర్టులో సవాల్ చేశారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ జరుగుతున్నది. యూన్ సుక్-యెల్‌ను గట్టి భద్రత మధ్య సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు.

దేశ వ్యతిరేక శక్తుల నుంచి ప్రమాదం
గత సంవత్సరం డిసెంబర్‌లో యున్ సుక్ యోల్ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిగంటల్లోనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఉత్తర కొరియా, దేశ వ్యతిరేక శక్తుల నుంచి ప్రమాదం ఉందని యున్ సుక్ యోల్ పేర్కొన్నారు. అధ్యక్షుడి వాదనలను ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తోసిపుచ్చారు. మర్షల్ లా విధించిన కొద్దిగంటల్లోనే దక్షిణ కొరియా పార్లమెంట్ ఎదుట వేలాది మంది చేరుకొని మార్షల్‌లాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మార్షల్ లా కారణంగా దేశ పాలన సైన్యం చేతుల్లోకి
తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో అధ్యక్షుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. యూన్ సుక్ యోల్ సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. మార్షల్ లా కారణంగా దేశ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్తుంది. యూన్‌తో పాటు దక్షిణ కొరియా నిఘా సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ హాంగ్ జోగ్ వోన్ సైతం కోర్టుకు హాజరయ్యారు. మార్షల్ లా అమలు, ఉపసంహరణ తర్వాత డిసెంబర్ 14న దక్షిణ కొరియా పార్లమెంట్‌లో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. గత నెలలో యెల్‌ను అరెస్టు చేశారు.