ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టును 169 ఎకరాల్లో రూ.1700 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సంవత్సరానికి 4 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్‌ల ఉత్పత్తి జరగనుంది.
ఏపీ ప్రభుత్వం తో ప్రీమియర్ ఎనర్జీస్ ఒప్పందం
ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని ప్రీమియర్ ఎనర్జీస్ ప్రతినిధులు వెల్లడించారు. దేశీయంగా సోలార్ సెల్‌ల తయారీని ప్రోత్సహిస్తూ, ప్రాజెక్టు కోసం సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న నాయుడుపేట ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమీపంలో పోర్టు ఉండటం వల్ల ముడి సరుకుల దిగుమతికి అనుకూలత ఉందని వివరించారు.
సోలార్ టెక్నాలజీ అభివృద్ధికి పెద్ద దన్ను
ప్రీమియర్ ఎనర్జీస్ ఈ ప్లాంట్‌తో దేశీయంగా సోలార్ టెక్నాలజీ అభివృద్ధికి పెద్ద దన్నుగా మారుతుందని చెబుతోంది. ఉత్పత్తి ప్రక్రియలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి, గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ ఉత్పత్తుల కేంద్రం
2026 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రీమియర్ ఎనర్జీస్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ ఉత్పత్తుల కేంద్రంగా మార్చేందుకు మరింత సహాయపడుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నందున, మరిన్ని ఇలాంటి ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.