Software Engineer : ప్రాణాలు కాపాడిన సెల్ ఫోన్ వెలుగు! క్రికెట్ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు కోల్పోయి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు ఊహించని విధంగా కాపాడబడ్డాయి. రాత్రివేళ రైల్వే పట్టాలపై పడుకున్న అతడు చివరిసారి తన సోదరితో మాట్లాడాలనుకున్నాడు. అదే ఫోన్ కాల్ అతడి జీవితాన్ని మారుస్తుందని ఊహించలేడు. చీకట్లో సెల్‌ఫోన్ వెలుగు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో నివసించే 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై రూ. 3 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పటికే అప్పులు చేసుకున్న అతడు స్నేహితుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.గురువారం రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ శివారులోని రైల్వే పట్టాలపై పడుకుని ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు.ఆ సమయంలో తన సోదరి గుర్తొచ్చింది. కాస్త నమ్మసక్యం లేదనుకుని ఆమెకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు.క్రికెట్ బెట్టింగ్ కోసం అప్పులు చేశానని, వాటిని తీర్చలేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అప్పుడు అతడి సోదరి భయాందోళనకు గురై తాను డబ్బులు చెల్లిస్తానని, వెంటనే ఇంటికి రావాలని కోరింది. ఈ క్రమంలో వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతోంది.అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం చివరలో జీఆర్పీ కానిస్టేబుల్ సైదులు, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో పట్టాలపై సెల్‌ఫోన్ వెలుగు కనిపించడంతో వారు అనుమానం వచ్చి అక్కడికి వెళ్లారు. ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలపై పడుకున్న యువకుడిని చూసి వెంటనే స్పందించారు.
అతడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆపై కుటుంబ సభ్యులను పిలిపించి యువకుడిని వారికి అప్పగించారు.ఈ ఘటన అతడి ప్రాణాలను కాపాడటమే కాకుండా, బెట్టింగ్ అనేది ఎంతటి ప్రమాదకరమైనదో తెలియజేసింది. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకుని, సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వారు కోరుతున్నారు.