అమెరికా (America) సంయుక్త రాష్ట్రాల్లోకి అత్యంత ప్రమాదకరమైన జీవ వ్యాధికారక క్రిమిని (బయోలాజికల్ పాథోజెన్) అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు చైనా దేశస్థులు చిక్కుల్లో పడ్డారు. ఈ పాథోజెన్‌ను వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఉపయోగించే అవకాశాలున్నాయని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటన అమెరికా (America) జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. నిందితులు అమెరికా(America) లోకి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యాధికారక క్రిమిని ‘ఫ్యుసేరియం గ్రామినియారం’గా గుర్తించారు. ఇది పంటలపై “కంకి ఎండు తెగులు” (హెడ్ బ్లైట్) అనే వ్యాధిని కలుగజేస్తుందని, దీనివల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ ఫంగస్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పంటల నష్టం అనేక బిలియన్ల డాలర్లకు చేరుతుంది. అమెరికా వ్యవసాయ భద్రతపై ఇది భయంకరమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా దీనిని సంభావ్య వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా వర్గీకరించినట్లు తెలిపింది. ఈ ఫంగస్ వల్ల విడుదలయ్యే విషపదార్థాలు మనుషులు, పశువుల్లో వాంతులు, కాలేయానికి నష్టం, పునరుత్పత్తి సంబంధిత లోపాలను కూడా కలిగిస్తాయి.

అభియోగాలు – తీవ్రమైన నేరాల జాబితా
ఎఫ్‌బీఐ నమోదు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం.. జున్యోంగ్ లియు (34) చైనా పరిశోధకుడు. 2024 జులైలో తన స్నేహితురాలు యున్కింగ్ జియాన్ (33)ను కలవడానికి అమెరికా (America) వచ్చినప్పుడు ఈ ఫంగస్‌ను తనతోపాటు తీసుకువచ్చాడు. జియాన్ పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రయోగశాలలో పరిశోధనలు నిర్వహించేందుకే తాను ఈ పాథోజెన్‌ను అక్రమంగా అమెరికాలోకి తెచ్చినట్టు లియు అంగీకరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఎలక్ట్రానిక్ సంభాషణలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయని అధికారులు తెలిపారు. వీరిపై కుట్ర, అమెరికాలోకి వస్తువుల అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు చేయడం, వీసా మోసం వంటి అభియోగాలను నమోదు చేశారు. యున్కింగ్ జియాన్ చైనాలో ఈ పాథోజెన్‌పై పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం నుంచి నిధులు కూడా పొందినట్లు తెలిసింది. ఆమె ఎలక్ట్రానిక్ పరికరాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)తో సంబంధాలున్నట్టు సూచించే సమాచారం కూడా లభ్యమైందని సమాచారం. శాస్త్రీయ పరిశోధన పేరుతో అత్యంత సున్నితమైన పాథోజన్ల అక్రమ ప్రయోగాలు ఆందోళనకరం. ఈ కేసు తర్వాత పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు పటిష్ఠ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం.
Read Also: Raja Raghuvanshi: మధ్యప్రదేశ్ దంపతుల కేసులో హత్య