న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్లో చివరి వరకు వెనుకంజలో ఉన్న ఢిల్లీ సీఎం అతిశీ.. అనూహ్యంగా లాస్ట్ రౌండ్లో పుంజుకుని విజయం సాధించింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతిశీ.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందింది. కల్కాజీ ఎన్నిక ఫలితం చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి పూర్తి అధిపత్యం కనబరుస్తూ వచ్చారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి సీఎం అతిశీ స్వల్ప అధిక్యం దక్కించుకున్నారు తప్పితే.. రమేష్ బిధూరినే లీడ్లో కొనసాగారు.

దీంతో కల్కాజీలో సీఎం అతిశీ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ.. చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకున్న అతిశీ.. బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆప్ అగ్రనేతలు ఎన్నికల్లో ఓటమి పాలవగా.. అతిశీ అనూహ్య విజయం సాధించారు. ఇక, 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆప్ వరుస విజయాలకు బ్రేకులు వేసిన కాషాయ పార్టీ.. హస్తినా పీఠం దక్కించుకుంది.
కాగా, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి అతిశీ ఈ స్థానాన్ని 11,393 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. ఆమెకు 52.28శాతం ఓట్ల వాటాతో 55,897 ఓట్లు వచ్చాయి. అతిశీ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌కు 41.63 శాతం అంటే 44,504 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి శివానీ చోప్రా కేవలం 4,965 ఓట్లతో (4.64శాతం) మూడవ స్థానంలో నిలిచారు.