శ్రీ విష్ణు మరోసారి హిట్ కొట్టాడా?
సామజవరగమనా, ఓం భీమ్ బుష్ వంటి విభిన్నమైన ఎంటర్‌టైన్మెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు తాజా ప్రయత్నం #సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ప్రేమ, హాస్యం, పంచ్‌ల మేళవింపుతో ప్రేక్షకుల మనసు దోచే ప్రయత్నంలో విజయం సాధించిందా అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథలోకి వెళితే..
విజయ్ (శ్రీ విష్ణు) ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేస్తుంటాడు. అతని జీవితంలో అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా ఉండే మిత్రుడు అరవింద్ (వెన్నెల కిషోర్) కూడా అదే బ్యాంక్‌లో ఉద్యోగి. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ప్రేమ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఇద్దరూ సింగిల్స్ గానే మిగిలిపోతారు. ఇదే సమయంలో విజయ్, పూర్వ (కేతిక శర్మ)ను చూసి ఇష్టపడతాడు. అయితే పూర్వ కంటే ముందు నుండి విజయ్‌ను ప్రేమిస్తున్న హరిణి (ఇవానా) కూడా తన భావాలను వ్యక్తపరుస్తుంది. ఇలా ముగ్గురి మధ్య తలెత్తిన ట్రయాంగిల్ లవ్ కథే #సింగిల్. మరోవైపు అరవింద్ కూడా గాయత్రి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కథ నెమ్మదిగా మలుపులు తిరుగుతూ చివరకు విజయ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడన్న ప్రశ్నకు సమాధానం ఇస్తుంది.

కామెడీ ఓ రేంజ్‌లో పేలింది
ఈ సినిమాలో కథ అనేది పెద్దగా లేకపోయినా కథనం మాత్రం బాగా పని చేసింది. ఈ మధ్యకాలంలో థియేటర్లో కడుపుబ్బా నవ్వించే సినిమాల సంఖ్య తక్కువ. కానీ #సింగిల్ ఆ లోటును తీర్చింది. డైరెక్టర్ కార్తిక్ రాజు కామెడీ టెంపోలను అద్భుతంగా రీడ్ చేసి, ప్రతి సీన్‌లోనూ పంచ్‌లు పేలేలా ప్లాన్ చేసాడు. వన్ లైనర్స్, ట్రెండింగ్ మీమ్స్, సోషల్ మీడియా సెటైర్లు – అన్నింటినీ మిక్స్ చేసి ఓ హాస్యపూరితమైన సినిమా తీసుకొచ్చాడు. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, వెన్నెల కిషోర్ టైమింగ్ – వీటిదే సినిమా మేజర్ అసెట్. ఫస్టాఫ్ పూర్తిగా లవ్ ట్రాక్, కామెడీతో నడవగా, సెకండాఫ్‌లో కొంతవరకు కథను రివీల్ చేసి, మంచి ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సింగిల్స్ అనుభవాలను చూపించిన తీరు యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల ప్రదర్శన
శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్, న్యాచురల్ కామెడీ టచ్‌తో మరోసారి తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నాడు. డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. వెన్నెల కిషోర్ ప్రతీ సీన్‌లోనూ ప్రేక్షకులను నవరసాలతో కడుపుబ్బా నవ్వించాడు. ఆయన పాత్రకు ఉన్న టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ ఎలిమెంట్. కేతిక శర్మ, ఇవానా ఇద్దరూ తమ పాత్రల్లో న్యాయం చేసారు. విటివి గణేష్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు చిన్నవే అయినా, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ టచ్
విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు క్యూట్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా విజువల్స్‌కి తగ్గట్లుగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ విభిన్నంగా ఉంది. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం దృశ్యాలు ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండటం వల్ల సినిమా రన్‌టైమ్ బోరుగా అనిపించదు. అల్లు అరవింద్ నిర్మాణ విలువలు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించాయి. దర్శకుడు కార్తిక్ రాజు హాస్యాన్ని అందరికీ అర్థమయ్యేలా, ఆనందాన్ని కలిగించేలా అందించగలిగాడు. రచయిత భాను భోగవరపు డైలాగ్స్ సినిమాకు అసలైన ప్రాణం.
Read also: Aparadhi: ‘అపరాధి’ సినిమా కథ (ఆహా)