హైదరాబాద్: సింగర్ కల్పన మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది. తనపై తప్పుడు ప్రచారం చేసినటువంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కల్పన ఫిర్యాదుపై నేరెళ్ళ శారద స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్‌ను హెచ్చరించారు.

చికిత్స అనంతరం కోలుకున్న కల్పన
కాగా, సింగర్ కల్పన ఇటీవల తన ఇంట్లో అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె నిద్రమాతలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తొలుత ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న కల్పన.. తాను చనిపోవడానికి ప్రయత్నించలేదని, కేవలం మంచి నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకున్నానని తెలిపింది. అయితే మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నానని, అది భర్త సహకారంతోనే సాధ్యమైందని వివరించింది.