భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియం-4 మిషన్(Axiom-4 Mission)లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోకి విజయవంతంగా ప్రవేశించారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయుడిగా, కానీ ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా ( Shubhanshu Shukla) చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్‌గా విశేష సేవలు అందించిన తరువాత వ్యోమగామిగా ఎంపికయ్యారు.
యాక్సియం-4 మిషన్ ప్రయాణం – సహకారంతో ముందుకెళ్లిన భారత్
జూన్ 25, 2025 న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా) నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 ద్వారా ఈ మిషన్ ప్రయోగించబడింది. శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించారు. ఈ మిషన్ యాక్సియం స్పేస్, నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సహకారంతో ముందుకు సాగింది. ఇతర సభ్యులు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ (పోలాండ్), టిబోర్ (హంగేరీ) కాగా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ బ్యాకప్‌గా ఉన్నారు. వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా ఏడు సార్లు వాయిదా పడ్డ ఈ మిషన్, జూన్ 26న ISSతో అనుసంధానమైంది.
శాస్త్రీయ ప్రయోగాలు – మానవ ఆరోగ్యం నుంచి మొక్కల పెరుగుదల వరకు
ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా ఏడు కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో జీవనాధార వ్యవస్థలు, పోషకాహారం, మైక్రోగ్రావిటీ ప్రభావాలు — ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే, మొక్కల పెరుగుదలపై మైక్రోగ్రావిటీలో పరిశోధన చేస్తున్నారు. వాయేజర్ టార్డిగ్రేడ్స్ (కఠిన పరిస్థితుల్లో జీవించగల సూక్ష్మజీవులు)ను తీసుకెళ్లి వాటిపై ప్రయోగాలు జరుపుతున్నారు. మొత్తం 31 దేశాల నుంచి 60 ప్రయోగాల్లో భాగంగా శుభాంశు పరిశోధనలు భారత్ అంతరిక్ష విజ్ఞానానికి గౌరవాన్ని తీసుకురావడం విశేషం. ఇది ఇస్రో-నాసా సంబంధాల బలోపేతానికి, భారత అంతరిక్ష లక్ష్యాలకు మార్గదర్శకంగా నిలిచే ఘట్టంగా అభివర్ణించవచ్చు.
Read Also : India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్