Show cause notices : ఏపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు.

తగినంత సమయం ఇచ్చి తరువాత చర్యలు
సినిమా స్టూడియో నిర్మాణం, తత్సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమి వాడాల్సి ఉండగా.. అందులో 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్ కోసం వైసీపీ హయాంలో రామానాయుడు స్టూడియో అభ్యర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూమార్పిడిని అనుమతించొద్దని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ భూముల రద్దుకు సంబంధించి రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తగినంత సమయం ఇచ్చి తరువాత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.