కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ ఇద్దరు నేతలు, ముఖ్యంగా విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో, ఈ చిత్రం వెనుక అంతర్గత రాజకీయ సంకేతాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, థరూర్ ఈ ఫోటో ద్వారా పార్టీ అధిష్ఠానానికి ఏదో సందేశం పంపుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇది ఒక సాధారణ భేటీ మాత్రమే
ఈ సెల్ఫీకి సంబంధించి శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “బ్రిటన్ సెక్రటరీ జొనాథన్ రేనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన FTA (Free Trade Agreement) చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇది స్వాగతించదగిన పరిణామం” అని ఆయన ట్వీట్ చేశారు. ఇది ఒక సాధారణ భేటీ మాత్రమేనా? లేక మరేదైనా పొలిటికల్ అండర్‌టోన్ ఉందా? అనే విషయంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు
కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, శశిథరూర్ – పీయూష్ గోయల్ సమావేశం మైత్రితో కూడుకున్నదని కొంతమంది అంటున్నారు. అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది కొత్త చర్చకు దారి తీసింది. గతంలోనూ శశిథరూర్, తన స్వంత అభిప్రాయాలతో కాంగ్రెస్ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయనే విమర్శలున్నాయి. ఈ సెల్ఫీ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోనుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.