హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డుల కు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆయన ట్వీట్‌లో “చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు.
ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఏ సమాధానం చెబుతారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు.పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని మండిపడ్డారు. అలాగే హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
హోంగార్డుల ఆర్థిక ఇబ్బందులు
హోం గార్డులకు జీతాలు ఆలస్యమవడం వారిపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే వారిలో చాలా మంది తమ కుటుంబాల నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. నెల జీతం సమయానికి అందకపోవడంతో అప్పులు చేసి నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న ఉద్యోగులు
హోంగార్డుల సంఘాలు కూడా ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గతంలో కూడా జీతాల జాప్యం జరిగినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తున్నారు. హోంగార్డుల వేతన సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్షాల ఆందోళన
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హోంగార్డులకు వెంటనే జీతాలు చెల్లించాలని, లేదంటే ఉద్యమాలు తథ్యం అని హెచ్చరిస్తున్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజలకే ఇబ్బందులు కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్పందన
మరోవైపు, ఈ అంశంపై అధికార పార్టీ నేతలు మౌనంగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హోంగార్డుల సమస్య త్వరగా పరిష్కారమవుతుందా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.