ప్రధాని స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి.
న్యూఢల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఇంకా నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనిపై పార్టీ అధినాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష నేతల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ భేటీలో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు సీనియర్ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశాలు..
ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిని ఇద్దరికి ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్న సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఢిల్లీలోనూ అదే ఫార్ములాను అనుసరించాలని కమలదళం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మినీ ఇండియా ను ప్రతిబింబించేలా కొత్త కేబినెట్ ఎంపిక ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన జాట్ వర్గానికి చెందిన పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సైతం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక, ప్రమాణస్వీకారం ఉండనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను భాజపా 48 స్థానాల్లో విజయఢంకా మోగించి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఖాతా తెరవలేక చతికిలపడిన విషయం తెలిసిందే.