కన్నడ యాక్షన్ హీరో దాలి ధనంజయ్ నటిస్తున్న “జింగో” (Jingo) చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. గత ఏడాది వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోలో ధనంజయ్ చెప్పిన “జింగో” మోనాలాగ్‌కి, అలాగే దానికి అనుసంధానంగా వచ్చిన “నరా నరా జింగో” సంగీతానికి సోషల్ మీడియాలో అపారమైన స్పందన లభించింది. ఈ స్పందనే చిత్ర బృందానికి మరింత బలాన్ని ఇచ్చింది.
ప్రేక్షకుల ఆదరణతో కథా వ్యాప్తిని మరింతగా విస్తరించిన దర్శక–నిర్మాతలు, ఈ సినిమాను చిన్న పట్టణం నేపథ్యంలో ఉండే కథగా మొదలుపెట్టి, ఇప్పుడు భారీ స్థాయి కాన్వాస్‌తో పెద్ద తెరపై అద్భుతంగా అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడు శశాంక్ సోగల్ మాట్లాడుతూ .. “ఈ సినిమా రాజకీయ వ్యంగ్యం, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ కలగలిపి వినూత్న అనుభూతి కలిగించేలా ఉంటుంది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో నిర్మాణం జరుగుతోంది. స్టార్ కాస్ట్ కూడా చాలా బలంగా ఉంటుంది” అని తెలిపారు.
“డేర్‌డెవిల్ ముస్తఫా”తో గుర్తింపు పొందిన శశాంక్ సోగల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రధాన పాత్రలో దాలి ధనంజయ్ నటిస్తుండగా, దాలి పిక్చర్స్ & త్రిశూల్ విజనరీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రచన బృందంలో రఘవేంద్ర మయకొండ, రవిరంజన్, అభిషేక్ వి, అశిత్, శశాంక్ సోగల్ ఉన్నారు. సినిమాటోగ్రఫీని రాహుల్ రాయ్, సంగీతాన్ని నవనీత్ షామ్ అందిస్తున్నారు. 2026లో విడుదల కాబోయే ఈ సినిమా వినోదభరితమైన ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.