అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగియడానికి కొద్ది గంటల ముందు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కోవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా. ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె, మరియు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ చర్యతో, ట్రంప్ ప్రభుత్వం వీరిపై భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
డా. ఆంటోనీ ఫౌచీ, కోవిడ్ మహమ్మారి సమయంలో సమర్థంగా పని చేస్తూ ప్రజారోగ్య రక్షణలో కీలక పాత్ర పోషించారు. అయితే, కొంతమంది వీరిపై రాజకీయ కక్షతో విమర్శలు చేశారు. ఈ క్రమంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె విషయంలోనూ బైడెన్ ముందడుగు వేశారు. ఆయన కీలకమైన సైనిక నిర్ణయాల్లో పాల్గొనడంతో పాటు, దేశ రక్షణ కోసం కీలక పాత్ర పోషించారు. ఆయనపై జరిగే దుష్ప్రచారాలను ఆపడం కోసం బైడెన్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
క్యాపిటల్ హిల్ ఘటనపై విచారణ చేసిన హౌస్ కమిటీ సభ్యులు తమ పనిని నిష్పాక్షికంగా నిర్వహించారు. అయితే, ఈ విచారణ వల్ల ప్రభావితమైన వారు, కమిటీ సభ్యులపై ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని భావిస్తూ, బైడెన్ వారికి రక్షణ కల్పించారు. ఇదే నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో ముఖ్యమైన భాగమని ఆయన తెలిపారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు దీనిపై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు కొన్ని వర్గాలు దీనిపై విమర్శలు చేస్తున్నారు. అయితే, బైడెన్ తన నిర్ణయాన్ని ప్రజాస్వామ్య రక్షణకు సంబంధించి సరైనదిగా అభివర్ణించారు.