సామాన్యుడికి వినోదాన్ని అందిస్తున్న సినిమా థియేటర్లు(Cinema theatre) సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 శాతానికి పైగా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక వెలుగు వెలిగిన సినిమా థియేటర్లలో చాలా వరకు మూతపడ్డాయి. గతంలో సినిమా ఒక్కటే వినోదాన్ని అందించే సాధనంగా ఉండేది. ఇద్దరు స్నేహితులుగాని, కుటుంబసభ్యులుగాని సరదాగా ఎక్కడైనా వెళ్లాలంటే కేవలం సినిమాలే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వినోదాన్ని అనేక ఇతర మార్గాల ద్వారా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. రిసార్టులు, హోటళ్లు, పబ్లు వంటివి అందుబాటులో వచ్చిన తరువాత సినిమాలకు ద్వితీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా ఓటిటీలు వచ్చిన తరువాత ఇళ్లలోనే సినిమాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు వచ్చిన తరువాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకు(Cinema theatre) వెళ్లడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. పైగా కరోనా వచ్చిన తరువాత సినిమా థియేటర్ల నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. సినిమా థియేటర్లను అద్దె ప్రాతిపదికపై నిర్వహించడం తమ వల్ల కాదని సినీ ఎగ్జిబిటర్లు ఇటీవల ఉద్యమం చేపట్టారు. వాస్తవానికి సింగిల్ థియేటర్లు అన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు జోక్యం చేసుకుని తగిన పరిష్కారం చూపించేందుకు ముందుకు రావడంతో థియేటర్ల మూసివేత నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

ముఖ్యంగా కొందరు నిర్మాతలు స్వయంగా థియేటర్ల (Cinema theatre)నిర్వహణ బాధ్యతను చేపట్టడంతో మిగిలిన థియేటర్ల మనుగడ సమస్యగా మారింది. సినిమాల విడుదలను అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల (షేర్) రూపంలో ఇవ్వాలని థియేటర్ల యజమానులు కోరుతున్నారు. ఈ విధానం మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే అమలవుతున్నందున సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా ఇదే విధానం వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు. ఈ డిమాండ్కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం జూన్లో విడుదల కానున్న హరిహర వీరమల్లు, థగ్ లైఫ్, కన్నప్ప, కుబేర వంటి పెద్ద సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. థియేటర్ల బంద్ నిర్ణయం సరైంది కాదని, ముఖ్యంగా హరిహర వీరమల్లు వంటి ప్రతిష్టాత్మక చిత్రం విడుదల సమయంలో ఇలాంటి ఇబ్బందులు సృష్టించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతుండడంతో హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ సమావేశంలో దిల్ రాజు, సునీల్ నారంగ్, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. ప్రముఖ హీరోల సినిమాల విడుదల సమయంలో థియేటర్ల బంద్ నిర్ణయం సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరించారు. గతంలోనూ ఇలాంటి బంట్లు, షూటింగ్ల నిలిపివేతలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఫిలిం ఛాంబర్ సభ్యులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఒక సమావేశం నిర్వహించి ఒక కమిటీని నియమించారు. ఇందులో సినీ ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉన్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడాలన్న అంశంపై నిర్ణయాలు ఉండాలని నిర్ణయించారు. గత కొంత కాలంగా పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. సాధారణ కుటుంబ కథా చిత్రాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలకు కొంత గ్యారంటీ ఉండటం, ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నారు. దీనితో ప్రేక్షకులు ఓటీటీ కంటే థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరు మల్టీప్లెక్స్ లకు వెళ్లడానికి సిద్ధపడుతుండటం మరో సమస్యగా మారింది. మల్టీప్లెక్స్ లలో సౌండ్ ఎఫెక్ట్స్, సీటింగ్, ఏసీ వంటి సౌకర్యాలు సింగిల్ థియేటర్ల కంటే కొంత మెరుగ్గా ఉండటంతో ప్రేక్షకులు అక్కడికే వెళుతున్నారు. దీనివల్ల కూడా సింగిల్ థియేటర్ల (Cinema theatre)నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. ప్రస్తుతం సింగిల్ థియేటర్లకు సినిమాలు విడుదల చేసే సమయంలో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లకు అయితే షేర్ విధానం అమలు చేస్తున్నారు. అద్దె ప్రాతిపదికన ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు సింగిల్ థియేటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. మరోపక్క భారీ బడ్జెట్ చిత్రాలకు విడుదల చేసిన కొన్ని రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని, తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ తగిన చర్యలు తీసుకోకపోతే సింగిల్ థియేటర్ల మూతపడి అపార్ట్మెంట్లుగానో, వాణిజ్య సముదాయాలుగానో, కల్యాణ మండపాలుగానో రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.
Read Also: corruption:అంతులేకుండా పోతున్న అవినీతి