హైదరాబాద్ : తెలంగాణలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఇవాళ ఘనంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఎందుకంటే రేపట్నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కాబట్టి. స్కూల్ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై పాఠశాలలకు వెళ్లారు. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 18వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. 17న పునఃప్రారంభం కానున్నాయి.
సెలవు దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపోతే.. స్కూళ్లకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మొదలైన బస్సులు ఈ నెల 13వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయన్నారు.