తెలిసో తెలియకో, ఆవేశంలోనో, ఆగ్రహంతోనో కొందరు నేరాలకు పాల్పడుతుంటారు. చట్టం ముందు వీరు దోషులుగా పరిగణించిన తరువాత చేసిన తప్పుకు జైళ్లలో((Prison students success)) శిక్షను అనుభవిస్తుంటారు. అయితే తప్పు జరిగిన తరువాత ప్రాయశ్చితం అనేది ముఖ్యం. తాము చేసింది తప్పని, దానివల్ల ఒక కుటుంబం కాని, వ్యవస్థ కాని నష్టపోయిందన్న ఆవేదన కొందరు ఖైదీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చేసిన నేరాన్ని బట్టి దోషులకు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది.
Read also: పగ్గాలు లేని పసిడి ధరలు
కొందరికి యావజ్జీవ శిక్షలు కూడా పడతాయి. వీరు సంవత్సరాల తరబడి జైలు గోడల మధ్య దుర్భర జీవితాన్ని కొనసాగిస్తారు. కొందరు ఖైదీలు చేసిన తప్పుకు బాధపడుతూనే జైలు జీవితంలో వ్యక్తిగత మార్పులను కోరుకుంటారు. కొందరు వివిధ పనుల్లో నైపుణ్యతను పొందగా మరికొందరు విద్య పట్ల ఆసక్తి చూపిస్తారు. చాలా మంది ఖైదీలు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివినవారు ఉన్నారు. వీరికి ఉన్నత విద్యలు అభ్యసించాలన్న కోరిక ఉంటుంది. దీనికి దూరవిద్య ద్వారా వారి కోరికలను సాఫల్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన ఖైదీలు తిరిగి చదువుకోడానికి విద్యాదానం పేరుతో జైలు అధికారులు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా డా॥ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఖైదీలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గం చూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్న వారికి విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్లోని చర్లపల్లి, చంచల్ గూడతో పాటు కడప, రాజమండ్రి తదితర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ప్రోత్సహించారు.

గత విద్యాసంవత్సరం 2023-24లో ఏకంగా 230 మంది ఖైదీలు(Prison students success) డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్లు, డిప్లొమా కోర్సులు విజయవంతంగా పూర్తి చేసి పట్టాలను అందుకున్నారు. పదవ తరగతి చదివిన వారు చాలా మంది డిగ్రీలను పూర్తి చేయగలిగారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) స్వయంగా ఈ పట్టాలను వారికి అందించారు. ఆ సమయంలో ఖైదీలు ఆనందంతో ఉప్పొంగిపోవడం కనిపించింది. వీరిలో ఇద్దరు ఖైదీలు ఏకంగా బంగారు పతకాలను సాధించారు. పట్టాలు పొందిన వారిలో చర్లపల్లి, చంచల్గూడ కేంద్ర కారాగారాల్లోని 13 మంది ఖైదీలు ఉన్నారు. జిల్లా జైళ్లలో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న 25 మంది పురుషులు, ముగ్గురు మహిళలు పోస్టు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. తిరుపతి జిల్లాకు చెందిన యుగంధర్ యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు.
కడప కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న ఇతను యూనివర్శిటీ నుంచి మొత్తం నాలుగు డిగ్రీలు, మూడు పోస్టు గ్రాడ్యుయేషన్లను పూర్తి చేశాడు. బిఏ, ఎంఏ సోషియాలజీలో ఏకంగా రెండు బంగారు పతకాలను సాధించాడు. ఇక గుంటూరు జిల్లా చింతలపూడికి చెందిన రాజకుమారి బిఏలో అత్యధిక మార్కులను సాధించి బంగారు పతకాన్ని పొందింది. ఈ విధంగా ఎందరో ఖైదీలు తమ ముళ్లబాటను పూలబాటగా మార్చుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యారు. పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందినవారిలో కొందరు దాదాపుగా శిక్షను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నారు. జైలు జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఉన్నటువంటి ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నారు.

తాము చేసిన తప్పుకు పూర్తి స్థాయిలో పశ్చాత్తాపం చెందుతున్నారని జైలు అధికారులు పేర్కొంటున్నారు. జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చి. కరుడుగట్టిన నేరస్తులను మానవతావాదులుగా, సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దడంలో జైళ్లు చాలావరకు సఫలీకృతం అవుతున్నాయన డానికి డిగ్రీ, పీజీ పరీక్షల్లో వచ్చిన మార్పులు స్పష్టం చేస్తున్నాయి.జరిగిన తప్పును తలచుకుని వేదన చెందడం కంటే జైల్లోనే తమ జీవితాన్ని మార్పు చేసుకోవాలన్న దిశగా ఖైదీలు ఆలోచిస్తున్నారు. దీనికి జైలు అధికారులు సహకరించి వారిలో మార్పుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖైదీల్లో వస్తున్న మార్పును చూసి గవర్నర్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చే ఖైదీలు(Prison students success) తమ పాత జీవితాన్ని పూర్తిగా మరిచి తాము పొందిన విద్యార్హత సర్టిఫికెట్లతో మంచి జీవనాన్ని గడపాలని జైలు అధికారులు వారికి సూచిస్తున్నారు. మరికొందరు వృత్తి నైపుణ్యాన్ని కూడా పొందుతున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా తమ భవిష్యత్తు జీవనాన్ని ఆనందమయంగా గడిపేందుకు ఖైదీలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
డాక్టర్ గిరీష్కుమార్ సంఘీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: