కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో జీవన ప్రయాణం
కాల చక్రం గిరగిరా తిరుగుతోంది. 2025 సంవత్సరం ఒక కలగా కరిగిపోయింది. 2026 నూతన సంవత్సరంలో(New Year life planning) అడుగుపెట్టి అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి. కొత్త సంవత్సరంలో మరింత మెరుగైన జీవనం సాగించేందుకు, వృత్తి, ఉద్యోగాల్లో, చదువుల్లో తగిన గుర్తింపు సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు అవసరం. కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, సరికొత్త ప్రారంభం, ఉత్సాహం, సానుకూలతలకు శ్రీకారం చుట్టే సమయం. 2026వ సంవత్సరం జీవిత చక్రంలో మరుచిపోలేని మధురాను భూతిగా మలుచుకునేందుకు తగిన వ్యూహం, ప్రణాళికలతో పాటు శ్రమ, పట్టుదల కూడా ఎంతో ఆనవరం. భవిష్యత్తు కోసం సంతోషం, సంపద, ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత అభివృద్ధి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని ఆనందంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నం కొత్త సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టాలి. గత సంవత్సరంలో పనితీరుకు, ప్రస్తుతం మన పనితనానికి స్పష్టమైన మెరుగుదల కనిపించినప్పుడు లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది.
Read Also: Road Accidents: హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు
New Year life planning: ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, అలవాట్లు మార్చుకోవడం, లక్ష్యాలను సాధించడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాలి. ప్రతిఒక్కరికీ ఏవో దురలవాట్లు ఉంటాయి, మద్య, ధూమపానాలు మాత్రమే దురలవాట్లుగా భావిస్తారు. అయితే అతిగా ఆగ్రహం, ఆవేశం, విపరీతమైన ఆశలు, ఎదుటివారి అభివృద్ధిని చూసి బాధపడటం, మరొకరిని అనుకరించాలని ప్రయత్నించడం వంటివి కూడా దురలవాట్లుగానే గుర్తించాలి. ప్రతిఒక్కరితో స్నేహభావంతో మెలగాలి. అధికారంలో ఉన్నామని, కుటుంబాన్ని పోషిస్తున్నామని ఎదుటివారిని తక్కువగా చూడకూడదు. మన మాట మంచిది అయితే ఊరు మంచిగా ఉంటుందన్న సామెతను మరువకూడదు.
మెరుగైన జీవితం కోసం ముందస్తు ప్రణాళికలు
వేరొకరి గురించి మరొకరి దగ్గర చులకన చేసి మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. దీనివల్ల కొందరు వ్యక్తులను అనవసరంగా శత్రువులుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఆహార నియమాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తాయి. బయటి తిళ్లు విషతుల్యంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. అదేవిధంగా
ఈరోజు నుంచే వ్యాయామం, నడక. యోగ వంటివి చేయడానికి ఉపక్రమించండి. సమయం సరిపోవడం లేదని కొందరు చెబుతుంటారు. గంటలు గంటలు ఫోన్లో రీల్స్ చూస్తారు. ఫోన్లో కబుర్లతో కాలం గడుపుతారు. ఒక అరగంట వ్యాయామానికి కేటాయిస్తే శరీరానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే వ్యాయామం చేస్తున్నవారు మరింత మెరుగైన శ్రమను జోడించేందుకు ప్రయత్నించండి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో మరింత మెలుకువలు తెలుసుకుని ముందుకు సాగండి. మొక్కుబడిగా ఉద్యోగానికి వెళ్లాం, తిరిగి ఇంటికి వచ్చామని కాకుండా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పనిచేస్తే దానికి అనుకూల ప్రయోజనాలు వస్తాయి.
Read Also: Heart Attack Risk in Children: చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద
ప్రమోషన్లుగానీ, ఇంక్రిమెంట్లుగానీ మిగిలిన వారికంటే ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలి. రాత్రి పొద్దుపోయే వరకు కూర్చొని చదవడం కంటే తెల్లవారుజామన నిద్రలేచి చదివితే మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చదువుపై మనస్సు పెట్టి చదవాలి. అప్పుడే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. ఇక వ్యాపారం కాని, ఉద్యోగం కాని చేసి సంపాదిస్తున్న డబ్బును కొంతవరకైనా మదుపు చేసే ప్రయత్నం చేయాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక రూపంలో డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా దుబారా ఖర్చులను గుర్తించి తగ్గించుకోవాలి.
ఇంటి ఆహారంతో ఆరోగ్య పరిరక్షణ
అనవసరంగా టీలు తాగడం, సిగరెట్లు, గుట్కా సేవించడం వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఆహారం విషయంలో ఆకుకూరలు, మంచి పోషకాలు ఉన్న కూరగాయలు తినండి. జొన్న రొట్టెలు, పుల్కాలు వంటివి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.అదేవిధంగా మైండ్ సెట్ను మార్చుకోవాలి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం, ఏదో జరిగిపోయినట్లు ఆందోళన పడటం వంటి వైఖరిని మార్చుకోవాలి. గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను ఒక పాఠంగా గుర్తించి మార్పులు తీసుకురావడం ద్వారా కొత్త సంవత్సరంలో అభివృద్ధికి, లక్ష్య సాధనకు కృషి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: