Industrial development:ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు పరిశ్రమల రాకకోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వాల ప్రయత్నం ఆశించినంతగా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలను ఆకర్శించలేకపోతున్నారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ కొత్త (new) పరిశ్రమలు రాకపోగా ఉన్నవి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు కొత్తవాటికి ఆహ్వానం (invitation) పలికేందుకు సరైన పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త పరిశ్రమలకు ఎర్రతివాచీ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన చేసి పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన ప్రయత్నాలను ప్రారంభించారు. దీనితో కొన్ని భారీ పరిశ్రమలు రెండు రాష్ట్రాల్లో తమ యూనిట్లు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి.
రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఎక్కువగా హైదరాబాద్లో ఐటి రంగం విస్తరించింది. దీనితో ఉద్యోగ అవకాశాలు మెరుగు పడ్డాయి. ఐటి రంగం వల్ల ఉద్యోగవకాశాలు పెరుగుతాయే కాని జీడిపీని పెంచుకునే అవకాశం అంతగా ఉండదు. ఉత్పత్తులు మన దగ్గర ప్రారంభం కావాలి.
విదేశాల నుంచి దిగుమతులు తగ్గడం
దీనివల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులకు విదేశీ మార్కెట్కు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఇటు రాష్ట్రాలకు, అటు దేశానికి ప్రయోజనం కలుగుతుంది. శాంతిభద్రతల సమస్యలు.
ఉగ్రవాదులు, తీవ్రవాదుల కదలికలు లేని ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు తమ యూనిట్లను ప్రారంభించేందుకు ముందుకు వస్తాయి. అదే విధంగా పరిశ్రమల ఏర్పాటుకు ఏమేరకు వనరులు అందుబాటులో ఉన్నాయన్న అంశం కీలకంగా ఉంటుంది.
ప్రధానంగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యం, స్థానికంగా నివాసం ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఉండాలని పారిశ్రామికవేత్తలు కోరుకుంటారు. ఇదే సమయంలో స్థానికంగా ఉండే రాజకీయాల ప్రభావం తమపై ఉండదన్న నమ్మకం కలిగినప్పుడే పారిశ్రామిక వేత్తలు ముందడుగు వేస్తారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ అంశాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం పరిశ్రమలు రావడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఒకపక్క విశాలమైన సముద్ర తీరం, ఓడరేవులు అందుబాటులో ఉండటంతో తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యకం కలుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రధాన నగరాలకు కలుపుతూ ఈ రాష్ట్రం మీదుగా విస్తారమైన రైల్వే లైన్లు ఉన్నాయి. ఇక కార్మికులకు ఏమాత్రం కొరత లేకుండా అవసరం మేరకు వారిని తక్కువ ఖర్చుతో వినియోగించుకునే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో నైపుణ్యత కలిగిన కార్మికులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. విమానాశ్రయాలు కూడా ఉండటంతో పారిశ్రామిక వేత్తలు, వారి ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్ ఇంజనీర్లు విదేశాల నుంచి, దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు రావడానికి అవకాశం కలుగుతుంది.
ఇక తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలు పారిశ్రామికవేత్తలపై అంతగా ప్రభావం చూపించని విధంగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన పనివారు అందుబాటులో ఉంటారు. మరోపక్క హైదరాబాద్ నగరం విశ్వనగరం స్థాయిలో అభివృద్ధి చెందింది. బడా పారిశ్రామిక వేత్తలు, వారి కుటుంబాలు ఇక్కడ నివసించేందుకు పూర్తిస్థాయి అనుకూల వాతావరణం, సౌకర్యాలు ఉన్నాయి.
విద్య, వైద్య రంగాల్లో హైదరాబాద్ కీలకమైన అభివృద్ధి సాధించింది
పరిశ్రమలకు కావలసిన నీరు. విద్యుత్, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పరిశ్రమలు రెండు రాష్ట్రాలలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.
పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆదాయం కూడా పెరగడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వాలకు అవకాశం కలుగుతుంది. కరోనా సమయంలో చిన్నతరహా పరిశ్రమలు వేల సంఖ్యలో మూతపడ్డాయి. దీనితో వీటిలో పనిచేసే లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారు.

పెద్ద సంస్థలు తమ వ్యాపారాలను నిలిపివేశారు. కొన్ని శతాబ్దాల నుండి కొనసాగుతున్న కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. సినిమా రంగం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. రెండు రాష్ట్రాల్లో వందలాదిగా థియేటర్లను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్లు, కల్యాణ మండపాలుగా మార్చివేశారు. అదేవిధంగా వేలాదిగా పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులు తమ వృత్తిని వదిలి ఇతర ఉపాధి పనుల్లో నిమగ్నమై కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
తిరిగి పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, సంస్థలు మూతపడకుండా వాటికి ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవాలి. స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి.
వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఉండే పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఇటు రైతులను, అటు పారిశ్రామిక వేత్తలకు సహకారం ఇచ్చే అవకాశాలు కలుగుతాయి. మరోపక్క మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరవడానికి సన్నాహాలు చేయాలి. వీటికి తోడు విదేశాల నుంచి భారీ పరిశ్రమలను ఆహ్వానించాలి. రాజకీయాల ప్రభావం వాటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే పారిశ్రామికంగా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.
Read also:hindi.vaartha.com
Read also: Fake Products Regulation Failure:కల్తీని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం