తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) వాసులకు శుభవార్త. సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ (TIMS) ఆసుపత్రిని జూన్ 2న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులపై భారీ రోగుల ఒత్తిడి కొనసాగుతుండగా, సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభమైతే ఈ భారాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషించనుంది. గతేడాదే ఈ ఆసుపత్రిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. అల్వాల్‌లో న్యూరోసైన్సెస్, సనత్‌నగర్‌లో కార్డియాక్ సైన్సెస్, కొత్తపేటలో గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆసుపత్రుల నిర్మాణం 2022లో ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అల్వాల్ ఆసుపత్రి 70 శాతం, కొత్తపేట ఆసుపత్రి 30 శాతం పనులు పూర్తయ్యాయి.
సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు
ఇప్పటికే పూర్తయిన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పూర్తిగా పనిచేసే స్థాయికి ఈ ఆసుపత్రిని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ప్రారంభమైతే నగరంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న చికిత్సా భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : India – Pakistan War : యుద్ధం ఇంకా ఆగిపోలేదు – మోడీ సంచలన వ్యాఖ్యలు