తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR ), ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మధ్య జరుగుతున్న రహస్య సమావేశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ భేటీలపై కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు సరైన వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది. కానీ కేటీఆర్ మాత్రం లోకేశ్‌తో రహస్యంగా సమావేశమవుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసంలేక ఇతర ప్రయోజనాల కోసమా?” అని ఆయన ప్రశ్నించారు.
పలుమార్లు భేటీ, గోప్య చర్చలు?
సామ రామ్మోహన్ (Sama Ram Mohan Reddy) ఆరోపించేది ఏమిటంటే, కేటీఆర్ ఒక్కసారి కాదు, పలుమార్లు లోకేశ్‌తో భేటీ అయ్యారని. ఈ భేటీల్లో ఏమి చర్చించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. “ఇది కేవలం ఒక సాదారణ భేటీ కాదు. వీరి చర్చలు ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి? రాష్ట్ర రాజకీయాలపై దాని ప్రభావం ఏమిటి?” అని ప్రశ్నించారు. నీటి సమస్యలు వంటి కీలక అంశాలపై పోరాటం చేస్తున్న సమయంలో ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు ఏపీ మంత్రితో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఇది
తెలంగాణకు న్యాయం చేయాలని పోరాటం జరుగుతున్న సమయంలో, తమ నేతలు రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. “ఇది తెలంగాణ హక్కులను రక్షించాల్సిన సమయం. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేరే లైన్‌లో నడుస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలి” అని సామ రామ్మోహన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో స్పందనను తెచ్చే అవకాశముంది.
Read Also : Indiramma House : చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి