ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా (Pilibhit district in Uttar Pradesh) లో వింత సంఘటన చోటుచేసుకుంది. సమోసా (samosa) కోసం జరిగిన చిన్న తగాదా, చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. భర్త సమోసాలు తీసుకురాలేదన్న కారణంతో భార్య కోపంతో తల్లిదండ్రులను పిలిపించి గొడవకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.పిలిభిత్ జిల్లా పురన్‌పూర్ పరిధిలోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన శివమ్, సెహ్రామౌ నార్త్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సంగీతతో మే 22న వివాహం జరిగింది. వివాహం తర్వాత ఇద్దరూ ఆనందంగా గడుపుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆగస్టు 30న జరిగిన చిన్న సంఘటనతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సమోసా మర్చిపోయిన భర్త
ఆ రోజు సంగీత, తన భర్త శివమ్‌ను పని నుంచి వస్తూ సమోసాలు తెమ్మని కోరింది. కానీ శివమ్ అలసటలో ఆ విషయం మర్చిపోయి ఇంటికి వచ్చాడు. సమోసాలు తీసుకురాలేదన్న కారణంతో సంగీత తీవ్ర ఆగ్రహానికి గురైంది. భర్తతో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహంలో ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా గొడవ కొనసాగించింది.తర్వాతి దశలో, సంగీత తన తల్లిదండ్రులు ఉష, రామ్‌లదాతేలను ఇంటికి పిలిపించింది. ముగ్గురూ కలిసి శివమ్‌తో పాటు అతని తండ్రి విజయ్ కుమార్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శివమ్ కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో దూషించారని కూడా బాధితులు పేర్కొన్నారు.
పంచాయతీ విఫలమైంది
ఆగస్టు 31న గ్రామ మాజీ సర్పంచ్ అవధేష్ శర్మ సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ పెద్దల మధ్యస్థాయిలో జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. దీంతో వివాదం మరింత ముదిరింది.సెప్టెంబర్ 1న శివమ్ తండ్రి విజయ్ కుమార్ పురన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు సమోసాలు తీసుకురావడం మర్చిపోయినందుకే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగీతతో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని కోరారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
పోలీసులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పిలిభిత్ పోలీసులు స్పష్టం చేశారు.సాధారణంగా కనిపించే చిన్న కారణం ఇలా పెద్ద సమస్యగా మారడం గ్రామంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సమోసా వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం, ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశమైంది.
Read Also :