బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పూర్వీకులకు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు తాజాగా కేంద్రం కూడా షాకిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ లో పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తేసింది. అప్పట్లో సైఫ్ నానమ్మను ఆయన ముత్తాత అయిన హమీదుల్లా ఖాన్ కు చట్టబద్దమైన వారసురాలిగా గుర్తించింది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ తీర్పును సమీక్షించి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన ఆమె అక్క ఆబిదా సుల్తాన్ ను మాత్రమే వారసురాలిగా తేల్చింది. దీంతో సైఫ్ కుటుంబానికి దక్కాల్సిన హమీదుల్లా ఖాన్ కు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్ధితి నెలకొంది.

2017లో ఈ చట్టాన్ని సవరించి వారి వారసులు కోర్టులో దీనిపై నెల రోజుల్లోగా అప్పీలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఆలోపే మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర హోంశాఖ వీటిని శరణార్దుల ఆస్తులుగా గుర్తించింది. అంటే స్వాధీనానికి లైన్ క్లియర్ చేసింది. పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోయారు. అయితే పాకిస్తాన్ వెళ్లిపోయిన ఆబిదా సుల్తాన్ చట్టబద్ధమైన వారసురాలు అని ఆమె దేశం విడిచి శత్రుదేశానికి వెళ్లిపోయింది కాబట్టి ఆమె ఆస్తుల్ని శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.